మరింత తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
నవంబర్‌లో 4.38 శాతం
జారుడు బల్లపై వరుసగా ఐదవ నెల
ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గిన ఫలితం
న్యూఢిల్లీ: రిటైల్ ధరల పెరుగుదల స్పీడ్ వరుసగా ఐదవ నెల నవంబర్‌లో మరింత తగ్గింది. కేవలం 4.38 శాతంగా ఈ పెరుగుదల రేటు నమోదయ్యింది. అంటే 2013 నవంబర్‌లో పోల్చితే 2014 నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 4.38 శాతమన్నమాట. నెలల వారీగా స్పీడ్ రేట్ (శాతం) తగ్గుకుంటూ రావడం ఇది ఐదవ నెల. ఆహార ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం.
పాలసీ రేటు- రెపో తగ్గించడానికి ఇది ఒక అవకాశమని పారిశ్రామిక వర్గాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి విజ్ఞిప్తి చేస్తున్నాయి. 2012 జనవరి నుంచీ వినియోగ ధరల సూచీ ఆధారంగా (సీపీఐ) నెలవారీ ఈ రిటైల్ ధరల పరిస్థితిని కేంద్రం ప్రకటిస్తోంది. అటు తర్వాత ఇంత కనిష్ట స్థాయిలకు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ఇదే తొలిసారి. గత మూడు నెలల నుంచీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్టోబర్‌లో ఈ రేటు 5.52 శాతం. 2013 నవంబర్‌లో ఈ రేటు 11.16 శాతం.
వేర్వేరుగా చూస్తే... సూచీలో భాగమైన ఆహార పదార్థాలవిభాగంలో ధరల స్పీడ్ అక్టోబర్‌లో 5.59 శాతం ఉండగా, ఇది నవంబర్‌లో 3.14 శాతానికి తగ్గింది. కూరగాయల విషయానికి వస్తే వార్షిక ప్రాతిపదికన (2013 నవంబర్‌తో పోల్చి 2014 నవంబర్‌లో) అసలు ధరలు పెరగ్గపోగా, 10.9 శాతం తగ్గాయి. అక్టోబర్ (-1.45 శాతం) కన్నా ఈ క్షీణత మరింత తక్కువ. పండ్ల ధరల పెరుగుదల రేటు అక్టోబర్‌లో 17.49 శాతం. అయితే తాజా సమీక్ష నెలలో 13.74 శాతంగా ఉంది.
కాగా ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం ధరలు 6.34 శాతం నుంచి 6.48 శాతానికి స్వల్పంగా పెరిగాయి. పప్పు దినుసుల ధరలు కూడా స్వల్పంగా 7.51 శాతం నుంచి 7.54 శాతానికి చేరాయి. ఆల్కాహాలేతర పానీయాల ధరలు కూడా స్వల్పంగా 5.64 శాతం నుంచి 5.75 శాతానికి ఎగశాయి.
ఇక ఇంధనం, లైట్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 3.29 శాతం నుంచి స్వల్పంగా 3.27 శాతానికి తగ్గింది.
పట్టణ భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.63 శాతం నుంచి 4.69 శాతానికి తగ్గింది.
గ్రామీణ భారత్‌కు సంబంధించి ఈ రేటు 5.52 శాతం నుంచి 4.09 శాతానికి దిగింది.