
ముంబై : స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరడంతో ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 10 లక్షల కోట్లకు చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా సత్తా చాటింది. గురువారం ఉదయం పది గంటలకు ఆర్‌ఐఎల్ షేర్ రూ 1579కు చేరగానే అదేసమయంలో కంపెనీ షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ 10 లక్షల కోట్లు పలికింది. ఈ ఏడాది ఆర్‌ఐఎల్ షేర్ 41 శాతం పెరగ్గా, బీఎస్‌ఈ సెన్సెక్స్ కేవలం 12 శాతం పైగా లాభపడింది. ఈ ఏడాది అక్టోబర్ 18న ఆర్‌ఐల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 9 లక్షల కోట్లకు చేరగా మరో నెలలోనే మరో రూ లక్ష కోట్ల మేర తన విలువను పెంచుకోగలిగింది. రూ 7.81 లక్షల కోట్లతో ఆర్‌ఐఎల్ తర్వాత టీసీఎస్ రెండో అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీగా నమోదైంది.