జియో వన్స్‌మోర్‌..ముకేశ్‌ హ్యాట్రిక్‌! | RIL raises Rs 60596 crore from Jio Platforms | Sakshi
Sakshi News home page

జియో వన్స్‌మోర్‌..ముకేశ్‌ హ్యాట్రిక్‌!

Published Sat, May 9 2020 2:27 AM | Last Updated on Sat, May 9 2020 5:25 AM

RIL raises Rs 60596 crore from Jio Platforms - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ గ్రూప్‌ డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ .. పెట్టుబడుల సమీకరణలో జోరుగా దూసుకుపోతోంది. తాజాగా మరో అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌తో జట్టు కట్టింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్టా 2.32 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ విలువ రూ. 11,367 కోట్లు. దీంతో మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఏకంగా రూ. 60,596 కోట్లు సమీకరించినట్లయింది.

‘ఈ పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్‌ తర్వాత విస్టా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉంటుంది. దీంతో కేవలం మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలోనే దిగ్గజ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 60,596.37 కోట్లు సమీకరించినట్లవుతుంది‘ అని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ఇప్పటికే రూ. 43,574 కోట్లతో 9.99 శాతం, మరో టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సిల్వర్‌ లేక్‌ రూ. 5,666 కోట్లతో 1.15% వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్‌ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది.

20 శాతం వాటా విక్రయం దిశగా...
డిజిటల్‌ వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 38.8 కోట్ల సబ్‌స్క్రయిబర్స్‌తో అత్యంత తక్కువ కాలంలోనే టెలికం దిగ్గజంగా ఎదిగిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఇందులో భాగంగా ఉంది.  వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లకు జియో ప్లాట్‌ఫామ్స్‌ 20 శాతం వాటాలు విక్రయించాలని నిర్దేశించుకుంది. ఇప్పటికే మూడు ఒప్పందాల ద్వారా 13.46 శాతం వాటాలను విక్రయించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పెట్టుబడులు సమీకరించనుంది.

డిసెంబర్‌ నాటికే రుణాలు తీర్చేసే దిశగా..
2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గతేడాది ఆగస్టులో నిర్దేశించుకుంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే ఈ ఏడాది డిసెంబర్‌లోనే దాన్ని సాధించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఫేస్‌బుక్, సిల్వర్‌ లేక్, విస్టా ఈక్విటీ పెట్టుబడులు, రూ. 53,125 కోట్ల ప్రతిపాదిత రైట్స్‌ ఇష్యూ, సౌదీ ఆరామ్‌కో వంటి దిగ్గజాలకు గ్రూప్‌ సంస్థల్లో వాటాల విక్రయం వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. మార్చి ఆఖరు నాటికి రిలయన్స్‌ రుణభారం రూ. 3,36,294 కోట్లుగా ఉండగా, నగదు నిల్వలు రూ. 1,75,259 కోట్లు. సర్దుబాట్లు చేస్తే నికర రుణం రూ. 1,61,035 కోట్లు. రుణాలు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా జూన్‌ నాటికి రైట్స్‌ ఇష్యూ వంటివన్నీ కలిపి రూ. 1.04 లక్షల కోట్లు సమీకరించవచ్చని కంపెనీ భావిస్తోంది.

మూడు డీల్స్‌లో జియోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌: 60,596 కోట్లు 
ఫేస్‌బుక్‌ పెట్టుబడి (9.99% వాటా)                          : 43,574 కోట్లు
విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌ (2.32% వాటా)                     : 11,367కోట్లు
సిల్వర్‌ లేక్‌ పెట్టుబడి (1.15 % వాటా)                      : 5,666 కోట్లు
జియో ఎంటర్‌ప్రైజ్‌ విలువ                                        :5.16 లక్షల కోట్లు


విస్టా సహ వ్యవస్థాపకుడు మనోడే..!
అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం విస్టా ప్రధానంగా సాఫ్ట్‌వేర్, డేటా, టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దాదాపు 57 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం విస్టా పోర్ట్‌ఫోలియోలో భారత కంపెనీల్లో సుమారు 13,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్‌ సేథ్‌కి భారతీయ మూలాలు ఉన్నాయి. ముకేశ్‌ అంబానీలాగే ఆయన తండ్రి కూడా గుజరాత్‌కు చెందినవారు. అంతే గాకుండా విస్టా వ్యవస్థాపకుడు రాబర్ట్‌ స్మిత్‌తో ముకేశ్‌కు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. ముకేశ్‌కు అత్యంత సన్నిహితులైన మనోజ్‌ మోదీ, బ్రయాన్‌ సేథ్‌ ఈ డీల్‌ చర్చల్లో కీలక పాత్ర పోషించారు.

విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్‌ సేథ్‌

ప్రపంచంలోనే దిగ్గజ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల్లో ఒకటైన విస్టాతో భాగస్వామ్యం కుదరడం సంతోషకరం. రాబర్ట్‌ స్మిత్‌తో పాటు గుజరాత్‌కి చెందిన కుటుంబ నేపథ్యమున్న బ్రయాన్‌ సేథ్‌.. ఇద్దరూ అంతర్జాతీయంగా ప్రముఖ టెక్నాలజీ లీడర్లు. డిజిటల్‌ భారతదేశ వృద్ధి సామర్థాలపైగట్టి నమ్మకం ఉన్నవారు.  
– ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత  

భారత్‌ కోసం జియో నిర్మిస్తున్న డిజిటల్‌ సమాజం సామర్ధ్యంపై మాకు నమ్మకం ఉంది. ముకేశ్‌ అంబానీ దార్శనికత, ప్రపంచస్థాయి జియో నాయకత్వ బృందం కలిసి ప్రారం భించిన డేటా విప్లవాన్ని మరింత ముం దుకు తీసుకెళ్లగలవు.  

– రాబర్ట్‌ స్మిత్, విస్టా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement