
ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 557 పాయింట్లు జంప్‌చేసి 34,844కు చేరగా.. నిఫ్టీ 161 పాయింట్లు పెరిగి 10,303ను తాకింది. కాగా.. ఇటీవల డిజిటల్, మొబైల్ సేవల అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం నేపథ్యంలో జోరు చూపుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఐఎల్ షేరు 3 శాతం ఎగసి రూ. 1618ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 1610 వద్ద ట్రేడవుతోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో తాజాగా అబుధబీ ఇన్వెస్ట్‌మెంట్ అధారిటీ(ఏడీఐఏ) రూ. 5683 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.16 శాతం వాటాను సొంతం చేసుకోనుంది.
7 వారాల్లో 8 డీల్స్
డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయానికి మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడు వారాల్లో 8 డీల్స్‌ను కుదుర్చుకుంది. తద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 21 శాతం వాటాను విక్రయించింది. రూ. 97,886 కోట్లను(దాదాపు 13 బిలియన్ డాలర్లు) సమీకరించింది. తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 22న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను రూ. 43,574 కోట్లకు కొనుగోలు చేయగా.. తదుపరి పీఈ సంస్థలు సిల్వర్ లేక్, విస్టా పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, సిల్వర్‌లేక్ స్వల్ప మొత్తంలో వాటాలను సొంతం చేసుకున్న విషయం విదితమే. వెరసి జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లను తాకాగా.. ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment