అదానీ చేతికి రిలయన్స్ ఇన్ఫ్రా ట్రాన్స్ మిషన్
డీల్ విలువ రూ.2,000 కోట్లు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ విద్యుత్ ప్రసార వ్యాపారాన్ని అదానీ గ్రూప్‌కు విక్రయించనున్నది. ఈ వ్యాపారంలో వంద శాతం వాటాను అదాని ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు విక్రయించనున్నామని రిలయన్స్ ఇన్‌ఫ్రా తెలిపింది. దీనికి సంబంధించిన ఒప్పందంపై బుధవారం సంతకాలు జరిగాయనిపేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించకపోయినప్పటికీ, ఈ డీల్ విలువ రూ.2,000 కోట్లకు మించి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ డీల్ కారణంగా అదానీ ట్రాన్స్‌మిషన్‌కు 10వేల సర్క్యూట్ కిమీ. పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజె క్ట్స్ చేతిలో ఉంటాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు.
రిలయన్స్ ఇన్‌ఫ్రా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటకల్లో వెస్టర్న్ రీజియన్ సిస్టమ్ స్ట్రెంగ్తెనింగ్ స్కీమ్(డబ్ల్యూర్‌ఎస్‌ఎస్‌ఎస్), బీ అండ్ సీ ప్రాజెక్ట్స్ కింద విద్యుత్ ప్రసార వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పర్బతి కొల్డమ్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ(పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌వెంచర్)లో 74 శాతం వాటా ఉంది. ఈ మూడు ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి, ఇప్పుడు ఆదాయాలను ఆర్జిస్తున్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల్లో వంద శాతం వాటాను అదానీ ట్రాన్స్‌మిషన్‌కు విక్రయిం చింది. కాగా ఈ వ్యాపార విక్రయ లావాదేవీకి ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది. ఈ లావాదేవీ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కానున్నదని అంచనా.