
శ్రీసిటీలో ఉత్పత్తి ప్రారంభించిన రోటోలాక్
తడ: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో సోమవారం యూకేకి చెందిన రోటోలాక్ వాల్వ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ప్రారంభమైంది. తన ఉత్పత్తుల తయారీని మొదలుపెట్టింది. రోటోలాక్ హోల్డింగ్స్ లిమిటెడ్ గ్రూపునకు చెందిన ఈ ప్లాంటును గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ సీన్ స్వేల్స్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వేల్స్ మాట్లాడుతూ మెటీరియల్స్ హ్యాండిలింగ్‌కు అవసరమైన రోటరీ ఎయిర్‌లాక్స్, డైవర్టర్, సైడ్ వాల్వులు, రోటరీ వాల్వులు, కన్వేయర్లు ఇక్కడ ఉత్పత్తవుతాయన్నారు. ఇప్పటివరకు భారత్‌లో లభించే వాల్వులు యూకేలో తమ ప్లాంటులో తయారై దిగుమతి చేసుకున్నవని, ఇకనుంచి అవి ఇక్కడే తయారవుతుండటంతో అదే నాణ్యత తో తక్కువ ధరకు పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూకే వాణిజ్య, పెట్టుబడుల శాఖ సీనియర్ అడ్వయిజర్ సుజిత్ థామస్, పరిశ్రమ జీఎం ప్రసన్న వీరరాఘవన్ పాల్గొన్నారు.