
రెండేళ్లలో 1,000 కోట్ల రుణాలు
⇒‘సాక్షి’ ఇంటర్వ్యూ: యూఏఈ ఎక్స్చేంజ్ ఎండీ వి. జార్జ్ ఆంటోనీ
⇒ఎన్నారై రెమిటెన్స్‌ల్లో పెద్దగా మార్పు లేదు
⇒బ్యాంకింగ్ లెసైన్స్‌పై మరోసారి ప్రయత్నం
⇒వ్యాపార విస్తరణకు ప్రస్తుతం నిధులు అవసరం లేదు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ కరెన్సీ నుంచి స్వదేశీ మనీ ట్రాన్స్‌ఫర్ వరకు అన్నీ ఆర్థిక సేవలను ఒకే గొడుగు కింద అందిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో త్వరలోనే బ్యాంకింగ్ లెసైన్స్ కూడా పొందగలమన్న ధీమాను యూఏఈ ఎక్స్ఛేంజ్ వ్యక్తం చేస్తోంది. ప్రీపెయిడ్ కార్డులతో పాటు గ్రామీణ రుణ మార్కె ట్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామంటున్న యూఏఈ ఎక్స్ఛేంజ్ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జ్ ఆంటోనీతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ...
రూపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే నిధుల ప్రవాహం (రెమిటెన్స్) ఎలాగుంది?
రూపాయి విలువ పెరగడం తగ్గడం అనేది ఎన్నారైల రెమిటెన్‌పై పెద్దగా ప్రభావం చూపదు. వీళ్లలో ప్రతీ నెలా ఇంటి అవసరాలకై నగదు పంపేవారే ఎక్కువగా ఉన్నారు. వీరికి రూపాయి పెరగడం, తగ్గడంతో సంబంధం లేకుండా జీతం కింద ప్రతీ నెలా పంపిస్తూనే ఉంటారు. రూపాయి విలువ ఇంకా తగ్గుతుందని వీరు పంపకుండా కూర్చుంటే ఇక్కడి వీరిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. కార్పొరేట్లు, ఇతర వ్యాపారసంస్థలు మాత్రమే రెమిటెన్స్‌ను వాయిదా వేసుకోగలవు కానీ సాధారణ ప్రజల రెమిటెన్స్‌లపై రూపాయి మారక ప్రభావం తక్కువే అని చెప్పొచ్చు. రూపాయి విలువ తగ్గడం వలన ఇండియాకి వస్తున్న నిధులు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయే కానీ ప్రతీ నెలా పంపే మొత్తంలో మాత్రం పెద్దగా తేడా ఏమీ లేదు.
యూఏఈ ఎక్స్ఛేంజ్ ఎటువంటి సేవలను అంది స్తోంది? మిగిలిన సంస్థలతో పోలిస్తే మీ ప్రోడక్టుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
ఒక్క డిపాజిట్ల సేకరణ తప్ప దాదాపు అన్ని ఆర్థిక సేవలను ఒకే చోట అందిస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే యూఏఈ ఎక్స్ఛేంజ్ అనేది ఒక ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్. ఫారిన్ ఎక్స్ఛేంజ్ లావాదేవీల్లో ఇండియాలోనే మొదటి స్థానంలో ఉన్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా కరెన్సీ రేట్లు ఒకే విధంగా ఉండటం మా ప్రత్యేకత. అలాగే రెమిటెన్సెస్, 24 గంటలు పనిచేసే విధంగా డొమెస్టిక్ మనీట్రాన్స్‌ఫర్, ట్రావెల్ అండ్ టూర్స్, బీమా, చిన్న స్థాయి రుణాలు, ప్రీపెయిడ్ కార్డులు, యుటిలిటీ చెల్లింపులు ఇలా అన్ని సేవలను అందిస్తున్నాం. త్వరలోనే ఒకే కార్డులోనే వివిధ దేశాల కరెన్సీని లోడ్ చేసుకునే విధంగా మల్టీ కరెన్సీ కార్డును ప్రవేశపెట్టబోతున్నాం. అలాగే క్షణాల్లో 180 దేశాల నుంచి నగదు పంపే విధంగా ఎక్స్‌ప్రెస్‌మనీ పేరుతో సేవలు అందిస్తున్నాం. వినియోగదారుడు ఒకసారి మా శాఖకు వస్తే ఒకే చోట అన్ని ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకెళ్ళొచ్చు.
బ్యాంక్ లెసైన్స్ పొందాలనుకున్న ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయి?
మొన్న ఆర్‌బీఐ కేవలం రెండు సంస్థలకు మాత్రమే బ్యాంక్ లెసైన్స్ ఇచ్చింది. ఈసారి కూడా బ్యాంక్ లెసైన్స్‌కు దరఖాస్తు చేస్తాం. ఆర్‌బీఐ విడుదల చేసే కొత్త మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే ఒక బ్యాంక్ చేసే అన్ని కార్యకలాపాలను కొనసాగిస్తుండటమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో తప్పకుండా లెసైన్స్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాం.
ప్రస్తుత ఆదాయం, వ్యాపార విస్తరణ నిధుల సేకరణ గురించి వివరిస్తారా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 367 శాఖలు ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 61 శాఖలను కలిగి ఉన్నాం. కొత్తగా హైదరాబాద్ రీజియున్‌లో 9, కరీంనగర్ రీజియున్‌లో రెండు శాఖలను ప్రారంభించాం. గతేడాది రూ. 5,000 కోట్ల ఆదాయంపై రూ. 20 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాం. గత పదేళ్ల నుంచి లాభాల్లో ఉండటంతో వ్యాపార విస్తరణకు నిధుల అవసరం లేదు. ప్రస్తుతం చిన్న రుణాల మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. రూ. 50 వేల లోపు పర్సనల్, గోల్డ్, వ్యాపార రుణాలను మంజూరు చేస్తున్నాం. ప్రస్తుతం రూ. 450 కోట్లుగా ఉన్న రుణ పోర్ట్‌ఫోలియో రెండేళ్లలో రూ. 1,000 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యం. రెండేళ్ల తర్వాతనే ఐపీవో లేదా ఇతర మార్గాల్లో నిధుల సేకరణ గురించి ఆలోచిస్తాం.