కొత్త పెద్ద నోట్లను క్రమంగా ఉపసంహరించాలి
చెన్నై: ఎకానమీలో నగదు పరిమాణాన్ని తగ్గించే దిశగా.. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2,000, రూ. 500 నోట్లను కొన్నాళ్ల తర్వాత క్రమంగా ఉపసంహరించాలని కేంద్ర రెవెన్యూ శాఖ మాజీ కార్యదర్శి ఎంఆర్ శివరామన్ సూచించారు. నగదు–జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నిష్పత్తి 13 శాతం స్థాయిలో ఉండటం సరికాదని, ఇన్నాళ్లూ ఆర్‌బీఐ పాటించిన నగదు ఎకానమీ విధానాలను ఎవరూ ప్రశ్నించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే మూడేళ్లలో నగదు–జీడీపీ నిష్పత్తిని 7 శాతానికి తగ్గించే క్రమంలో కొత్త రూ. 2,000, రూ. 500 నోట్లను క్రమంగా ఉపసంహరిస్తామని, కేవలం రూ.100 అంతకన్నా తక్కువ విలువ గల నోట్లే చలామణీలో ఉంటాయంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని శివరామన్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో విఫలమైన కేంద్రం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వసించి క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ పేమెంట్స్ వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు సాధనాల వినియోగం గణనీయంగానే ఉంటుంది కనుక పట్టణ ప్రాంతాల్లో నగదు సరఫరాను తగ్గించి.. గ్రామీణ ప్రాంతాల్లో పెంచాలని శివరామన్ తెలిపారు.