భారతదేశంలో ప్రస్తుతం నోట్ల రద్దు, ఉపసంహరణ మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. రూ. 2000 నోట్ల ఉపసంహరణ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా రూ. 500 నోట్లను కూడా రిజర్వ్ బాంక్ అఫ్ ఇండియా రద్దు చేస్తుందని లేదా ఉపసంహరించుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపైన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శక్తికాంత దాస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రూ. 500 నోట్ల రద్దు & ఉపసంహరణకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవాలే అని, ఇప్పటి వరకు ఈ విషయంపై ఆర్‌బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదని తెలిసింది. అంతే కాకుండా రూ. 1000 నోట్లను మళ్ళీ ప్రవేశపెట్టే ఉద్దేశ్యం అసలే లేదని వెల్లడించారు.
(ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్‌బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం)
రూ. 500 నోట్ల రద్దు మీద జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని శక్తికాంత దాస్ వెల్లడించారు. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ వివరణ ఇచ్చారు. ఇప్పటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం వెనక్కి వచ్చాయని దాస్ తెలిపారు. తిరిగి వచ్చిన నోట్ల విలువ సుమారు రూ.1.82 లక్షల కోట్లు. చెలామణిలో ఉన్న రెండు వేల నోట్ల విలువ రూ. 3.62 లక్షల కోట్లు అని గతంలోనే వెల్లడించారు.
(ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్‌మెంట్‌లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..)
తిరిగి వచ్చిన రూ. 2,000 నోట్లలో 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లుగా, మిగిలినవి మార్పిడి కోసం వచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. 2023 మే 19న ఆర్‌బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడికి లేదా డిపాజిట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి రోజు అని కూడా అప్పుడే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment