
కొత్త రూపాయి నోటు వచ్చింది
20 ఏళ్ల తర్వాత మళ్లీ ముద్రణ
న్యూఢిల్లీ: సుమారు 20 ఏళ్ల విరామం తర్వాత సరికొత్త హంగులతో ఒక్క రూపాయి నోటు ముద్రణ మళ్లీ మొదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సంతకంతో ఇది తాజాగా విడుదలైంది. రాజస్థాన్‌లో నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో మహర్షి ఈ నోటును విడుదల చేశారు. మిగతా కరెన్సీ నోట్లతో పోలిస్తే ఈ రూపాయి నోటుకో ప్రత్యేకత ఉంటుంది. మిగతావన్నీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో ఉంటే.. ఈ రూపాయి నోటుపై మాత్రం ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటుంది.
ప్రత్యేకతలు ఇవీ...: కొత్త రూపాయి నోటు 110 మైక్రాన్ల మందంతో ఉంటుంది. వాటర్‌మార్కుగా అశోక స్తంభం చిహ్నం (సత్యమేవ జయతే పదాలు లేకుండా) ఉంటుంది. నోటు మధ్యలో ఒక అంకె, కుడివైపున ఒక పక్కగా భారత్ (హిందీలో) అనే పదం దాగి ఉంటాయి. నోటు ముందు భాగంలో ఆర్థిక శాఖ కార్యదర్శి మహర్షి సంతకం రెండు భాషల్లో ముద్రించి ఉంటుంది. ముద్రణా వ్యయం పెరిగిపోవడం వల్ల 1994లో ఒక్క రూపాయి నోటు ముద్రణ నిలిచిపోయింది.