ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరవరోజూ రికవరీ అయ్యింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం ముగింపుతో పోల్చితే 21 పైసలు బలపడింది. 71.46 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 71.67. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్లలో 143 పైసలు బలపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరల భారీ పతనం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి తక్షణ కారణాలు.
అంతర్జాతీయ వృద్ధి మందగమనానికి అవకాశం ఉందని అమెరికా ఫెడ్ తాజా వ్యాఖ్యలు, దీనితో రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారిన డాలర్ ఇండెక్స్ రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ అభిప్రాయపడ్డారు. ఎగుమతిదారులు, బ్యాంకర్ల డాలర్ అమ్మకాలు, ట్రేడింగ్ ప్రారంభంతోనే రూపాయి పటిస్టంగా 71.39 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత 71.27కూ బలపడింది. అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్టం 74.39కి పడింది. అటు తర్వాత క్రమంగా ప్రస్తుత స్థాయికి రికవరీ అయ్యింది.
క్రూడ్ భారీ పతనం...
తాజా గణాంకాలు చూస్తే, అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్‌లో లైట్ స్వీట్‌క్రూడ్ బ్యారల్ ధర ఈ వార్త రాసే సమయానికి కీలక మద్దతు 55.40 స్థాయిని కోల్పోయింది. (ఈ స్థాయిని అధిగమించడానికి దాదాపు ఏడాదిన్నర పట్టింది). ఐదు శాతానికి పైగా పతనంతో 53.66కు పతనం అయ్యింది.
ఈ ఏడాది డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ గరిష్టస్థాయి 76.90. ఇక భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ఈ ఏడాది గరిష్టస్థాయి 86.74. అయితే నెమ్మదిగా కిందకు దిగుతూ, మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఐదుశాతానికి పైగా పతనమై 63.12ను తాకింది. ఇక ఈ వార్త రాసే రాత్రి 10 గంటలకు ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 96.51 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 71.45 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment