ముంబై: మరోసారి డాలర్లకు డిమాండ్ ఏర్పడటంతో దేశీ కరెన్సీ రూపాయి మరింత పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే 39పైసలు నష్టంతో 68.01వద్ద ముగిసింది. మే 24 తర్వాత మరోసారి కనిష్ట స్థాయిలో ముగిసింది. ఇంట్రాడేలో 68.04 వరకు తగ్గగా, ఆ తర్వాత మూడు పైసల మేర కోలుకుంది. వాణిజ్య లోటు అంచనాలకన్నా ఎక్కువగా ఉండటం ప్రభావాన్ని చూపించింది. డాలర్ బలానికి అత్యధికంగా నష్టపోయిన ఆసియా కరెన్సీ రూపాయే.
దేశ వాణిజ్య లోటు నాలుగు నెలల గరిష్ట స్థాయిలో 14.62 బిలియన్ డాలర్లుగా మే నెలలో నమోదైన విషయం తెలిసిందే. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 50 బిలియన్ డాలర్ల మేర టారిఫ్‌లు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలియజేయడం వాణిజ్య ఘర్షణలపై తాజా ఆందోళనలకు ఆజ్యం పోసింది. అమెరికా దుందుడుకు వాణిజ్య విధానాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాలతో కరెన్సీ ట్రేడర్లు అప్రమత్త ధోరణి ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment