ముంబై/న్యూఢిల్లీ: డాలర్ బలం ముందు రూపాయి చిన్నబోతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఘర్షణలు, దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలతో రూపాయి వరుసగా ఐదో రోజూ క్షీణించింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు తగ్గి 71.58 వద్ద స్థిరపడింది.
రూపాయికి ఇది నూతన జీవితకాల కనిష్ట స్థాయి ముగింపు. క్రితం ముగింపు 71.21తో పోలిస్తే ఇంట్రాడేలో రూపాయి కాస్త నిలదొక్కుకుని 71.09 వరకు చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టపోయింది. మంగళవారం ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 79 డాలర్లు దాటిపోయింది. దీంతో దేశ చమురు దిగుమతుల భారం పెరిగి కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు మరింత పెరుగుతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఇది రూపాయిపై ఒత్తిళ్లను పెంచుతోంది.
రూపాయి దానికదే స్థిరపడాలి
రూపాయి దానికదే స్థిరపడాల్సి ఉందని, కరెన్సీ క్షీణతకు దేశీయ అంశాలు కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల, వాణిజ్య యుద్ధ భయాలే రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలని, వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. రూపాయి క్షీణతతో దేశ కరెంటు అకౌంటు లోటు కట్టుతప్పే ప్రమాదం ఉంటుంది. చమురు అవసరాల్లో 81 శాతం దిగుమతులే కావడం ప్రధానంగా ఈ లోటునకు కారణం.
మరింత పడుతుంది: ఎస్‌బీఐ
రూపాయి డాలర్ మారకంతో ఇంకొంత పడిపోవచ్చని ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక పేర్కొంది. దీంతో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు చర్యను అనుసరించాల్సి రావచ్చని అభిప్రాయపడింది. రూపాయి మంగళవారం 37 పైసలు నష్టపోయి నూతన గరిష్ట స్థాయి 71.58కి చేరిన నేపథ్యంలో ఎస్‌బీఐ నివేదిక పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యం నెలకొంది.
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఇంత వరకు చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో, ఫారెక్స్ మార్కెట్ విషయంలో ఆర్‌బీఐ ప్రస్తుతానికి జోక్యం చేసుకోకుండా ఉండే విధానాన్ని అనుసరించొచ్చని ఎస్‌బీఐ ఎకోరాప్ అంచనా వేసింది. ‘‘జూన్‌లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచిన దగ్గర్నుంచి రూపాయి 6.2 శాతం మేర పడిపోయింది. డాలర్ బలోపేతం కారణంగానే రూపాయి క్షీణిస్తున్నప్పటికీ, ఇది ఇక ముందూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం’’ అని ఎస్‌బీఐ నివేదిక తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment