
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా నాలుగో రోజుకూడా నష్టాల్లో ముగిసింది.డాలరుమారకంలో ఇటీవల భారీగా కుప్పకూలుతున్న రూపాయి మంగళవారం కోలుకున్నా, చివరికి నష్టాలతోనే ముగిసింది. ఆర్బీఐ పాలసీ రివ్యూ,అధిక ముడి చమురు ధరలు దేశీయ కరెన్సీని దెబ్బతీశాయి. ఇంటర్ బ్యాంకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో, దేశీయ కరెన్సీ డాలర్ 70.80 వద్ద ప్రారంభమైంది. అనంతరం 70.47 గరిష్ట స్థాయికి పుంజుకుంది.. చివరకు డాలరుకు వ్యతిరేకంగా 8పైసలు క్షీణించి 70.81 వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో భారత యూనిట్ 202 పైసలను కోల్పోయింది. ముఖ్యంగా సోమవారం ఒక్క రోజే గత ఆరు సంవత్సరాల్లో లేనంత అతిపెద్ద సింగిల్-డే నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ ద్వైమాసిక విధానాన్ని బుధవారం ప్రకటించనుంది. కీలక వడ్డీరేటును వరుసగా నాలుగవసారి కూడా మరో 25 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించనుందని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment