ముంబై: ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడింది. గడచిన మూడు వారాల్లో ఒకేరోజు రూపాయి ఇంత ఎక్కువగా రికవరీ అవ్వడం ఇదే తొలిసారి. వరుసగా ఆరు రోజులు ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో పతనం బాట పట్టిన రూపాయి ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దాదాపు ఐదు డాలర్లు తగ్గడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం దీనికి ప్రధాన కారణాలు. మరోవైపు రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి అటు కేంద్రం ఇటు ఆ ర్‌బీఐ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ మారకం నిధుల ఆకర్షణ, మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడటంపై కేంద్రం దృష్టి సారించింది. శుక్రవారం ప్రారంభంతోటే రూపాయి పటిష్టంగా 73.84 వద్ద ప్రారంభమైంది. (గురువారం ముగింపు 74.12) అటు తర్వాత 73.52 స్థాయి వరకూ బలపడింది. దిగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను భారీగా అమ్మారు.
Comments
Please login to add a commentAdd a comment