రెండేళ్లలో దేశవ్యాప్తంగా ‘ఫ్రీడం’ ఆయిల్ | Sakshi interview with Gemini edibles MD Pradeep chowdary | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో దేశవ్యాప్తంగా ‘ఫ్రీడం’ ఆయిల్

Published Fri, Feb 13 2015 1:17 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రెండేళ్లలో దేశవ్యాప్తంగా ‘ఫ్రీడం’ ఆయిల్ - Sakshi

రెండేళ్లలో దేశవ్యాప్తంగా ‘ఫ్రీడం’ ఆయిల్

సాక్షి ఇంటర్వ్యూ

జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి
త్వరలో మార్కెట్లోకి రైస్ బ్రాన్ ఆయిల్

ప్లాంట్ల ఆధునీకరణకు రూ. 35 కోట్లు
పశ్చిమ తీరంలో రూ. 250 కోట్లతో రిఫైనరీ

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడం బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో తొలి స్థానం కైవసం చేసుకున్న ఈ సంస్థ.. ఇప్పుడుఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు మార్కెట్‌పై దృష్టిసారించింది. ఫ్రీడ ంను రెండేళ్లలో దేశవ్యాప్త బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని అంటున్నారు జెఫ్ వ్యవస్థాపకులు, ఎండీ ప్రదీప్ చౌదరి. జెఫ్‌లో అంతర్జాతీయ అగ్రి దిగ్గజం గోల్డెన్ అగ్రి రిసోర్సెస్ వాటా కైవసం చేసుకోవడం బూస్ట్‌నిచ్చిందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2016-17లో రూ.2,000 కోట్ల టర్నోవర్‌కు చేరతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ విస్తరణ, మార్కెట్ తీరుతెన్నులపై ఆయనేమన్నారంటే..
 
మూడు నెలల్లో రైస్‌బ్రాన్‌లోకి..
ప్రస్తుతం ఫ్రీడం బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెను, అలాగే ఫస్ట్ క్లాస్ బ్రాండ్‌లో పామోలిన్, వనస్పతి విక్రయిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీ కంపెనీలకు వీటితోపాటు ఇతర నూనెలు, కొవ్వులను సరఫరా చేస్తున్నాం. మే నెలలో రైస్‌బ్రాన్ ఆయిల్‌ను ప్యాకేజ్డ్ విభాగంలోకి తీసుకొస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనె నెలకు 25-30 వేల టన్నులు అమ్ముడవుతోంది. ఇందులో ఫ్రీడంకు 27 శాతం వాటా ఉంది. మూడేళ్లలో 35 శాతం లక్ష్యంగా చేసుకున్నాం. ఒడిశాలో 31 శాతం వాటా చేజిక్కించుకున్నాం. నెలకు 30 వేల టన్నులు అమ్ముడవుతున్న కర్ణాటకలో 2017కల్లా 20 శాతం వాటా దక్కించుకుంటాం.
 
అంతర్జాతీయ సంస్థ..
జెఫ్‌లో రుచి సోయా ఇండస్ట్రీస్‌కు ఉన్న 50 శాతం, ప్రమోటర్ల నుంచి 25 శాతం వాటాను ఇండోనేసియాకు చెందిన గోల్డెన్ అగ్రి సుమారు రూ.140 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. పామాయిల్ తోటలు, రిఫైనరీలతో అంతర్జాతీయంగా పేరున్న గోల్డెన్ అగ్రి టర్నోవర్ రూ.60,000 కోట్లకుపైనే. వారి చేరికతో మార్కెట్ పరంగా, ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా జెఫ్‌కు బలం చేకూరింది. పెద్ద ఎత్తున వృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్‌లో ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు గోల్డెన్ అగ్రి సుముఖంగా ఉంది.
 
మరో రిఫైనరీ..
కంపెనీకి కృష్ణపట్నం, కాకినాడ వద్ద రిఫైనరీలు ఉన్నాయి. కృష్ణపట్నం ప్లాంటు సామర్థ్యం రోజుకు 900 టన్నులు, కాకినాడ ప్లాంటు 250 టన్నులుంది. రెండు రిఫైనరీలకు ఇప్పటికే రూ.155 కోట్లు ఖర్చు చేశాం. వీటిని ఆధునీకరించేందుకు రూ.35 కోట్లు వెచ్చిస్తున్నాం. పశ్చిమ తీరంలో రూ.250 కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు మహారాష్ట్ర లేదా గుజరాత్‌ను పరిశీలిస్తున్నాం. ఆరు నెలల్లో స్పష్టత వస్తుంది.  2013-14లో జెఫ్ రూ.1,455 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్లు ఆశిస్తున్నాం.
 
ఐదేళ్లలో 100 శాతం..
భారత్‌లో వంట నూనెల వినియోగం ఏటా 1.6 కోట్ల టన్నులుంది. ప్యాకేజ్డ్ విభాగం 20 శాతం వృద్ధితో 55-60 శాతానికి చేరింది. బ్రాండెడ్ నూనెలపట్ల కస్టమర్లలో అవగాహన పెరుగుతుండడంతో ఐదేళ్లలో ఈ విభాగం 100 శాతానికి చేరడం ఖాయం. ఇక నూనెల వినియోగం చూస్తే ప్రపంచ సగటు 21-22 కిలోలుంది. భారత్‌లో ఇది 15 కిలోలు మాత్రమే. 10 ఏళ్ల తర్వాత ప్రపంచ సగటును మించిపోవడం ఖాయం. ఆదాయాల పెరుగుదల, మారుతున్న ఆహారపుటలవాట్లు ఇందుకు కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement