న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. వీటిలో ఓ 30 సంస్థల్లో వాటాలు విక్రయించడం ద్వారా ఖజానా నింపుకోవాలన్నది కేంద్రం వ్యూహం. ఈ కార్యక్రమాన్ని ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) చూస్తోంది. ముఖ్యంగా వీటిలో ఐదు సంస్థల్లో వాటాలను ఈ ఆర్థిక సంవత్సరం ఎలాగైనా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవి పవన్ హన్స్, హెచ్‌ఎస్‌సీసీ, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా, స్కూటర్స్ ఇండియా, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్. 2018–19లో ఈ సంస్థల్లో వాటాల విక్రయాన్ని పూర్తి చేయడం పట్ల దీపమ్ నమ్మకంతో ఉంది. తీవ్ర రుణ భారం, నష్టాల్లో కునారిల్లుతోన్న ఎయిర్ ఇండియాలోనూ వ్యూహాత్మక వాటాలను విక్రయించాలనుకున్న కేంద్రం దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయిన విషయం తెలిసిందే. ఈ ఆరు కాకుండా మరో 24 ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినప్పటికీ, ప్రాథమిక దశలోనే నిలిచిపోయాయి.
కొన్ని పీఎస్‌యూలకే
ఈ ఆర్థిక సంవత్సరం వాటాలు విక్రయించదలిచిన వాటిలో హెచ్‌ఎస్‌సీసీ, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్)ను ప్రభుత్వరంగంలో ఇదే విధమైన వ్యాపారంతో కూడిన కంపెనీలకే విక్రయించనుండడం గమనార్హం. నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎన్‌బీసీసీ వీటిలో వాటాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన సంస్థలైన పవన్ హన్స్, స్కూటర్స్ ఇండియా, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో వాటాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించనుంది. వీటిలో వాటాల విక్రయ ప్రతిపాదనకు మంచి ఆసక్తి నెలకొన్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటిలో వాటాలను విక్రయించే విషయమై విశ్వాసంతో ఉన్నాం. ప్రైవేటీకరణ చేయాలనుకున్న వాటి కోసం తగిన ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయడమే మా ప్రాధాన్యం’’ అని ఆ అధికారి చెప్పారు. ఇక ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా కంపెనీలను విలీనం చేయనున్నామని, విలీనం తర్వాత ఏర్పడే సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్టు తెలిపారు. మూడు సంస్థల విలీనానికే ఏడాది సమయం పడుతుందని, ఆ తర్వాతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరింత సమయం తీసుకుంటుందన్నారు.
మరికొన్ని సంస్థలు సైతం..
ఇక పవన్ హన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, ఓఎన్‌జీసీకి 49 శాతం వాటాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ వాటాలతో పాటు ఓఎన్‌జీసీ వాటాలను కలిపి ఒకే సారి ప్రైవేటు సంస్థకు అమ్మేయాలన్నది ప్రతిపాదన. నిజానికి గడిచిన పది నెలల్లో పవన్ హన్స్‌లో కేంద్ర ప్రభుత్వం వాటాలను రెండు సార్లు ఆఫర్ ఫర్ సేల్‌కు తీసుకురావడం జరిగింది. మొదటిగా గతేడాది అక్టోబర్‌లో ఆఫర్ ఫర్ సేల్‌ను ప్రకటించింది. కేవలం రెండే సంస్థలు గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, కాంటినెంటల్ హెలికాప్టర్స్ మాత్రమే ఆసక్తి చూపాయి. దీంతో ఆఫర్‌ను దీపమ్ ఉపసంహరించుకుంది. సవరించిన ఆఫర్‌ను ఏప్రిల్ చివర్లో తీసుకొచ్చింది. సుమారు 12 సంస్థల వరకు ఈ సారి తమ ఆసక్తి తెలిపాయి. తాజాగా ఓఎన్‌జీసీ కూడా తనకున్న మొత్తం వాటాలను అమ్మేయాలని నిర్ణయించడంతో పవన్ హన్స్ పూర్తిగా ప్రైవేటు పరం కానుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా నిధులను సమీకరించింది. వీటిలో భారత్ 22ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, రైట్స్ ఐపీవోలు ఉన్నాయి. మరో విడత భారత్ 22ఈటీఎఫ్, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ల ఫాలో ఆన్ ఆఫర్ల ద్వారా నిధులు సమీకరించే ఆలోచనను దీపమ్ చేస్తోంది. ఇంకా, ఐఆర్‌ఎఫ్‌సీ లిమిటెడ్, ఇర్కాన్, ఆర్‌వీఎన్‌ఎల్, మజ్‌గాన్ డాక్ షిప్‌బిల్డర్స్, గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్, నీప్కో, ఎంఎస్‌టీసీ ఐపీవోలు కూడా రానున్నాయి. వీటి ద్వారా కేంద్ర ఖజానాకు ఆదాయం సమకూరనుంది. ఇంకా ఇప్పటికే లిస్ట్ అయి ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ల ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. వీటికి తోడు నగదు నిల్వలు దండిగా ఉన్న కంపెనీలు బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైబ్యాక్ ఆఫర్లలో కేంద్రం తన వాటాలను తగ్గించుకోవడం ద్వారా నిధుల్ని సమీకరించొచ్చు.
పవన్‌హన్స్‌లో ఓఎన్‌జీసీ వాటా సైతం అమ్మకం
ప్రైవేటు హెలికాప్టర్ సేవల కంపెనీ పవన్ హన్స్‌లో తనకున్న 49 శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనకు చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ ‘ఓఎన్‌జీసీ’ బోర్డు ఆమోదం తెలిపింది. రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు, ప్రధానమైన ఆయిల్, గ్యాస్ వ్యాపారంపైనే దృష్టి సారించేందుకు వీలుగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పవన్‌హన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటాలను దీపమ్ ఇప్పటికే అమ్మకానికి (ఆఫర్ ఫర్ సేల్) పెట్టగా... దాంతోపాటే ఓఎన్‌జీసీ వాటాలను కూడా విక్రయించే అవకాశం ఉందని, సవరించిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. జాయింట్ వెంచర్ కంపెనీ పవన్‌హన్స్‌లో ప్రభుత్వం వైదొలుగుతున్నందున ఇక తాము కూడా కొనసాగదలుచుకోలేదని, ప్రభుత్వంతోపాటు తమ వాటాను కూడా విక్రయించాలని భావిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖకు ఓఎన్‌జీసీ లేక కూడా రాయడం గమనార్హం. పవన్ హన్స్ హెలికాప్టర్లను లీజుకిచ్చే వ్యాపారంలో ఉంది. మొత్తం 46 హెలికాప్టర్లను కలిగి ఉంటే, అందులో 22 లీజులో ఉన్నాయి. వీటిలో ఏడు వరకు ఓఎన్‌జీసీ అద్దెకు తీసుకున్నవే. తన ఆఫ్‌షోర్ చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకు సిబ్బందిని తరలించేందుకు వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ హన్స్‌లో తమ పెట్టుబడులు వ్యూహాత్మకం ఎంత మాత్రం కాదని ఓఎన్‌జీసీ అధికారి ఒకరు తెలిపారు. ‘‘ఓఎన్‌జీసీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో గ్రూపు కంపెనీల వ్యాపార పునర్నిర్మాణ అవకాశాలను పరిశీలించేందుకు సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది’’ అని ఆ అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment