బ్లాక్‌బెర్రీపై శామ్‌సంగ్ కన్ను..! | Samsung talks to BlackBerry about $7.5 billion buyout | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బెర్రీపై శామ్‌సంగ్ కన్ను..!

Published Tue, Jan 27 2015 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

బ్లాక్‌బెర్రీపై శామ్‌సంగ్ కన్ను..!

బ్లాక్‌బెర్రీపై శామ్‌సంగ్ కన్ను..!

షేరుకి 15.49 డాలర్ల ఆఫర్   
డీల్ విలువ దాదాపు 7.5 బిలియన్ డాలర్లు

న్యూయార్క్: పూర్వ వైభవం కోసం తంటాలు పడుతున్న స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీని దక్కించుకోవడంపై శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా దృష్టి పెట్టింది. ఇందుకోసం బ్లాక్‌బెర్రీ ఒక్కో షేరుకి 13.35-15.49 డాలర్లు ఇవ్వజూపుతోంది. ఇది బ్లాక్‌బెర్రీ ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 38%-60% అధికం. దీని ప్రకారం చూస్తే డీల్ విలువ దాదాపు 6-7.5 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని అంచనా.

ఇరు కంపెనీల ప్రతినిధులు ఇటీవలే దీనిపై చర్చించేందుకు సమావేశమైనట్లు సమాచారం. అయితే, బ్లాక్‌బెర్రీ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది.  శామ్‌సంగ్‌తో ఎలాంటి చర్చలూ జరపడం లేదని స్పష్టం చేసింది.  ఇటీవల వచ్చిన అనేక టేకోవర్ ఆఫర్లను సైతం కంపెనీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్లాక్‌బెర్రీ పునర్‌వ్యవస్థీకరణ ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియ పూర్తయితే ఇప్పుడొస్తున్న ఆఫర్ల కంటే మరింత అధిక వాల్యుయేషన్ రాగలదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. భవిష్యత్‌లో బ్లాక్‌బెర్రీ అసెట్స్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో శామ్‌సంగ్ 7.5 బిలియన్ డాలర్ల ఆఫర్ గొప్పదేమీ కాకపోవచ్చని వారి వాదన.  శామ్‌సంగ్ ఇప్పటికే తమ గెలాక్సీ హ్యండ్‌సెట్స్‌కి సంబంధించి బ్లాక్‌బెర్రీతో కలిసి పనిచేస్తోంది.
 
కార్పొరేట్ మార్కెట్లోకి ఎంట్రీ పాస్..
సాధారణ మార్కెట్లోకి చొచ్చుకుపోయినంతగా కార్పొరేట్ మార్కెట్లోకి  శామ్‌సంగ్ దూసుకెళ్లలేకపోయింది. అనేక మొబైల్స్ తయారీ సంస్థల రాకతో ప్రస్తుతం సాధారణ మార్కెట్లో పోటీ తీవ్రతరమైపోయింది.  పైగా హైఎండ్ మార్కెట్లో యాపిల్‌తో పోటీపడాల్సి వస్తోంది. మరోవైపు బ్లాక్‌బెర్రీ బలం కార్పొరేట్లే. ఈ నేపథ్యంలోనే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేస్తే కార్పొరేట్ మార్కెట్‌నూ దక్కించుకోవచ్చన్నది శామ్‌సంగ్ వ్యూహం.
 
డీల్‌కు అడ్డంకులూ ఉన్నాయి..
బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేయడంలో  శామ్‌సంగ్ పలు అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. అన్నింటి కన్నా ముందుగా బ్లాక్‌బెర్రీని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న కీలక షేర్‌హోల్డరు ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చైర్మన్ ప్రేమ్ వత్స గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అలాగే కెనడా, అమెరికా నియంత్రణ సంస్థలు కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది. కెనడా చట్టం కింద బ్లాక్‌బెర్రీని విదేశీ సంస్థ కొనుగోలు చేయాలంటే ముందుగా ప్రభుత్వం అనుమతి ఉండాలి.

గతంలో చైనాకి చెందిన లెనొవొ గ్రూప్.. బ్లాక్‌బెర్రీ కొనుగోలుకి ప్రయత్నించినప్పటికీ భద్రతా కారణాల రీత్యా కెనడా ప్రభుత్వం అనుమతించ లేదు. తనకు లాభదాయకంగా ఉండే కొన్ని విభాగాలను మాత్రమే శామ్‌సంగ్ కొనాలనుకుంటే.. విక్రయిచేందుకు బ్లాక్‌బెర్రీ యాజమాన్యం అంగీకరించకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శామ్‌సంగ్ డీల్  ప్రయత్నాలు ఎంతవరకూ సఫలం అవుతాయన్నది చూడాల్సిందే.
 
బ్లాక్‌బెర్రీ నేపథ్యమిదీ..

1984లో రీసెర్చ్ ఇన్ మోషన్ సంస్థ పేరిట ప్రారంభమైన బ్లాక్‌బెర్రీ.. ఇతర కంపెనీల కన్నా చాలా ముందుగానే స్మార్ట్‌ఫోన్లకు శ్రీకారం చుట్టి కార్పొరేట్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే, శరవేగంగా దూసుకొచ్చిన ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లతో పోటీ పడలేక బ్లాక్‌బెర్రీ చతికిలబడింది. భారీ నష్టాల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే క్లాసిక్ హ్యాండ్‌సెట్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 44,000 పైచిలుకు పేటెంట్లు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో ఖాతాల ప్రకారం చూసినా వీటి విలువే 1.43 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుంది. మార్కెట్ విలువ కింద లెక్కగడితే మరింత ఎక్కువే ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement