ఎస్‌బీహెచ్ లాభం 444 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) నికరలాభంలో మార్చితో ముగిసిన త్రైమాసికానికి 17 శాతం వృద్ధి నమోదయ్యింది. 2012-13 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో రూ.380 కోట్లుగా ఉన్న నికరలాభం 2014 మార్చితో ముగిసిన క్యూ4లో రూ.444 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర వడ్డీ ఆదాయం 2.29 శాతం వృద్ధితో రూ. 1,004 కోట్ల నుంచి రూ.1,027 కోట్లకు పెరిగింది.
నికర వడ్డీ లాభదాయకత స్వల్పంగా పెరిగి 3.04 శాతం నుంచి 3.05కి చేరింది. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ భగవంతరావు మాట్లాడుతూ నిర్వహణా వ్యయం తగ్గించుకోవడం, వడ్డీ లాభదాయకత పెరగడంతో లాభాలు పెరగడానికి కారణంగా పేర్కొన్నారు. ఏడాది మొత్తం మీద చూస్తే నికరలాభం 18 శాతం క్షీణించి రూ.1,250 కోట్ల నుంచి రూ.1,020 కోట్లకు పడిపోయింది.
భయపెడుతున్న ఎన్‌పీఏలు
భారీగా పెరిగిన నిరర్థక ఆస్తులు ఎస్‌బీహెచ్‌ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్థూల నిరర్థక ఆస్తులు రూ.3,816 కోట్ల (3.46%) నుంచి రూ.5,824 (5.89%) కోట్లకు పెరగ్గా, నికర నిరర్థక ఆస్తులు రూ.1,449 కోట్ల (1.61%) నుంచి రూ. 2,985 కోట్లకు (3.12%) చేరాయి. దేశ ఆర్థిక వృద్ధిరేటు క్షీణతతోపాటు, రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాలు నిరర్థక ఆస్తులు పెరగడానికి ప్రధానకారణంగా భగవంతరావు పేర్కొన్నారు. గడిచిన ఏడాది ఎస్‌బీహెచ్ 4,400 కోట్ల విలువైన రుణాలను పునర్ వ్యవస్థీకరించింది. ఇందులో 80 శాతం పెద్ద కంపెనీలవే ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక, ఆహార, లోహా, టెక్స్‌టైల్, జెమ్స్‌అండ్ జ్యూయలరీ రంగాల నుంచి ఎన్‌పీఏల ఒత్తిడి ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం అనంతరం రుణాల్లో వృద్ధి పెరగడంతో పాటు ఎన్‌పీఏలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సీమాంధ్రపై ప్రత్యేక దృష్టి
మొత్తం రాష్ట్రంలో ఎస్‌బీహెచ్‌కు 1,060 శాఖలు ఉండగా అందులో అత్యధికంగా తెలంగాణ ప్రాంతంలో 710, సీమాంధ్రలో 350 ఉన్నాయి. హైదరాబాద్‌తో కలుపుకొని తెలంగాణ నుంచి రూ.90,000 కోట్ల వ్యాపారం జరుగుతుంటే, సీమాంధ్ర నుంచి రూ.25,000 కోట్ల వ్యాపారం మాత్రమే వస్తున్నట్లు భగవంతరావు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే మంచి పట్టుసాధించిన మేము కొత్తగా ఏర్పడే సీమాంధ్రలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జూన్2లోగా విజయవాడలో కార్పొరేట్ ఫైనాన్స్ శాఖను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా రాష్ట్రంలో 70 శాఖలను ఏర్పాటు చేస్తుండగా, రెండు రాష్ట్రాల్లో చెరో 35 చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 55 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు రావు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 650 మంది ఆఫీసర్లను, 1,000 మంది క్లరికల్ సిబ్బందిని ఎస్‌బీహెచ్ నియమించుకోనుంది.
రెండేళ్ల వరకు విలీన అవకాశాలు లేవు
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో ఎస్‌బీహెచ్ విలీనానికి రెండేళ్ల వరకు అవకాశాలు లేవని భగవంతరావు స్పష్టం చేశారు. అనుబంధ బ్యాంకుల్లో ఎస్‌బీఐ తర్వాత అత్యధిక లాభాలను ఎస్‌బీహెచ్ అందిస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో తమ శాఖను చేజిక్కించుకునేంత ఆర్థిక సామర్థ్యం ఎస్‌బీఐకి లేదన్నారు.