శాంతను ముఖర్జీ
- 2014-15లో రూ.1,317 కోట్లకు చేరిక
- గణనీయంగా తగ్గిన ఎన్‌పీఏలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 29.19 శాతం ఎగసి రూ.1,317 కోట్లకు చేరింది. 2013-14 క్యూ4తో పోలిస్తే మార్చి క్వార్టరులో నికర లాభం రూ.444 కోట్ల నుంచి అతి స్వల్పంగా పెరిగి రూ.445.5 కోట్లను తాకింది.
పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ ఆదాయం 10.49 శాతం అధికమై రూ.4,393 కోట్లు నమోదు చేసింది. నిర్వహణ లాభం 8.29 శాతం పెరిగి రూ.2,914 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 24 బేసిస్ పాయింట్లు ఎగసి 3.05 శాతం నుంచి 3.29 శాతంగా ఉంది. బుధవారం ఎస్‌బీహెచ్ బోర్డు డెరైక్టర్ల సమావేశం ముంబైలో జరిగింది. ఎస్‌బీహెచ్ చైర్మన్ అరుంధతి భట్టాచార్య సమక్షంలో ఆర్థిక ఫలితాలను ఎండీ శాంతను ముఖర్జీ విడుదల చేశారు.
తగ్గిన ఎన్‌పీఏలు..
క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 2014-15లో రూ.5,824 కోట్ల (5.89%) నుంచి రూ.4,984 కోట్లకు (4.59%) తగ్గాయి. మొత్తం వ్యాపారం 9.19% ఎగసి రూ.2.40 లక్షల కోట్లుగా నమోదైంది. మొత్తం అడ్వాన్సులు 9.98% అధికమై రూ.1.08 లక్షల కోట్లు, మొత్తం డిపాజిట్లు 8.54% పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు రూ.36,882 కోట్ల నుంచి రూ.43,105 కోట్లకు చేరాయి. 2014-15లో కొత్తగా 127 శాఖలు జతకూడాయి. దీంతో బ్యాంకు నెట్‌వర్క్ 1,821 శాఖలకు విస్తరించింది.