జీడీపీ– రుణ వృద్ధి మధ్య పెరిగిన వ్యత్యాసం: ఎస్‌బీఐ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), రుణ వృద్ధి రేటు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోయిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డైరెక్టర్ రజనీష్ కుమార్ ఇక్కడ విలేకరులతో అన్నారు. రుణ వృద్ధి 2016–17 ఆర్థిక సంవత్సరంలో దాదాపు అరవై సంవత్సరాల కనిష్ట స్థాయి (1953–54లో 1.7 శాతం) 5.08 శాతానికి పడిపోతే, జీడీపీ వృద్ధి మాత్రం 7 శాతంగా నమోదవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంతక్రితం జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉంటే, రుణ వృద్ధి రేటు సహజంగా 14 నుంచి 15 శాతంగా ఉండేదని ఆయన అన్నారు. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాల తీరు బాగున్నప్పటికీ, కార్పొరేట్ రుణ, ప్రాజెక్ట్ ఫైనాన్స్ విభాగాలు మాత్ర నిరుత్సాహంగా ఉన్నట్లు సీనియర్ బ్యాంకింగ్ అధికారి తెలిపారు. అంతక్రితం ఆయన ఇక్కడ ఎస్‌బీఐ ఏర్పాటు, తొలినాళ్లకు సంబంధిత ఒక ఫొటో గ్యాలరీని ఆవిష్కరించారు.