ఎస్‌బీఐ బాదుడు షురూ | SBI's new ATM, minimum balance charges effective from Saturday | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ బాదుడు షురూ

Published Tue, Apr 4 2017 12:12 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

ఎస్‌బీఐ బాదుడు షురూ - Sakshi

ఎస్‌బీఐ బాదుడు షురూ

అమల్లోకి వచ్చిన కొత్త చార్జీలు
కనీస నగదు నిల్వల్లేకపోతే జరిమానా
నగదు జమలు, ఏటీఎం, లాకర్ల సేవలన్నింటిపై చార్జీలే


న్యూఢిల్లీ: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా...? అయితే, మీరు కొత్త శకంలోకి అడుగుపెట్టారు. ఖాతాలో ఉంచాల్సిన కనీస నగదు నిల్వ మొత్తం పెంచేశారు. ఇది తెలుసుకోకపోతే జరిమానాల బాదుడుకు గురి కావాల్సి ఉంటుంది. చెక్‌ బుక్కులు కావాలంటే చార్జీలు... నెలలో మూడు సార్లకు మించి బ్యాంకు శాఖకు వెళ్లి డబ్బులు డిపాజిట్‌ చేస్తే చార్జీలు... ఏటీఎంలో ఐదు లావాదేవీలు దాటితే చార్జీలు... వార్షికంగా లాకర్ల చార్జీలు పెంపు ఇలా వరుసబెట్టి అవకాశం ఉన్న చోటల్లా ఖాతాదారుల ముక్కుపిండి చార్జీలను వసూలు చేసేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ సిద్ధమైపోయింది. ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన చార్జీలు, మార్చిన నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి.

ఎస్‌బీఐలో కొత్తగా విలీనమైపోయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, భారతీయ మహిళా బ్యాంకు కస్టమర్లు సైతం ఈ చార్జీల భారాన్ని ఎత్తుకోక తప్పదు. ఈ విలీçన బ్యాంకుల ఖాతాదారులకు మాత్రం ఈ ఛార్జీలు ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. ఎస్‌బీఐ బాటలోనే మిగిలిన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా నడిచే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే ఖాతాదారులు లబోదిబోమనాల్సిందే.

 ఇతర చార్జీల మోత ఇలా...
సేవింగ్స్‌ ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించుకోవాలి.
రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకు మించితే ప్రతీ రూ.1,000పై 75 పైసల చార్జీ ఉంటుంది. ఈ చార్జీ కూడా కనీసం రూ.50 తక్కువ కాకుండా వసూలు చేస్తారు.
నెలలో సొంత బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. ఇతర బ్యాంకు ఏటీఎంల్లో మూడుకు మించితే ప్రతీ లావాదేవీపై రూ.20 చొప్పున వడ్డన ఉంటుంది. ఖాతాలో కనీస నగదు నిల్వ రూ.25 వేలు ఉంచితే సొంత బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలపై చార్జీలు పడవు. అదేవిధంగా రూ.లక్ష బ్యాలన్స్‌ నిర్వహిస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంల్లోనూ లావాదేవీలు ఉచితం.
లాకర్‌ అద్దె కూడా పెరిగిపోయింది. అలాగే, ఏడాదిలో 12 సార్లు మాత్రమే ఉచితంగా లాకర్లను తెరిచేందుకు అనుమతి. ఆపై ప్రతిసారీ రూ.100 చెల్లించుకోవాల్సిందే.
కరెంటు ఖాతాదారులకు ఏడాదిలో 50 చెక్కులే ఉచితం, ఆపై ప్రతీ చెక్‌లీఫ్‌పై రూ.3 చార్జీ ఉంటుంది.
ఖాతా ప్రారంభం ఉచితం కాదు. రూ.20 చెల్లించుకోవాలి.

ఇక మహా బ్యాంకుగా ప్రస్థానం: అరుంధతి
వచ్చే నెల ఆఖరు నాటికి అనుబంధ బ్యాంకుల డేటా అనుసంధానం పూర్తి కాగలదని ఎస్‌బీఐ చైర్‌ పర్సన్‌ అరుంధతి భట్టాచార్య తెలిపారు. ఎస్‌బీహెచ్‌తో పాటు అనుబంధ బ్యాంకుల విలీనంతో మెగా బ్యాంకుగా అవతరించిన ఎస్‌బీఐ భారీ బ్యాంకుగా కార్యకలాపాలు ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయం వివరించారు. ‘మిగతా అనుబంధ బ్యాంకులన్నింటి విలీనం తర్వాత ఒకే పెద్ద బ్యాంకు’గా ఎస్‌బీఐ కార్యకలాపాలు ప్రారంభించింది. మరిన్ని కొత్త ఉత్పత్తులు, సర్వీసులు ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆడిట్‌ పూర్తయ్యాక.. ఏప్రిల్‌ 24 తర్వాత నుంచి ప్రతీ వారాంతం ఒక్కో బ్యాంక్‌ డేటాను ఎస్‌బీఐతో అనుసంధానించడం జరుగుతుంది. మే 27 నాటికి డేటా అనుసంధానం పూర్తి కావొచ్చు‘ అని అరుంధతి భట్టాచార్య తెలిపారు.

ఉత్పాదకత, నిర్వహణ సామర్ధ్యం మెరుగుపర్చుకోవడానికి, భౌగోళికమైన రిస్కులను సమర్ధంగా అధిగమించడానికి, కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడానికి విలీనం తోడ్పడగలదని ఆమె వివరించారు. అనుబంధ బ్యాంకుల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ)కు సంబంధించి అదనంగా రూ. 8,600 కోట్ల కేటాయింపులు జరిపినట్లు ఆమె చెప్పారు. ఎన్‌పీఏలు ప్రతికూల స్థాయిలో భారీగా పెరగకపోవచ్చని తెలిపారు. షేర్ల మార్పిడి ప్రక్రియ కూడా పూర్తయినట్లు వివరించారు.

ఎస్‌బీహెచ్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్, భారతీయ మహిళా బ్యాంక్‌ ఎస్‌బీఐలో విలీనం అయిన సంగతి తెలిసిందే. అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బీఐ అంతర్జాతీయంగా టాప్‌ 50 బ్యాంకుల్లో చోటు దక్కించుకుంది. బ్యాంక్‌ అసెట్స్‌ విలువ ప్రస్తుతం రూ. 37,00,000 కోట్లుగా ఉంటుంది. సుమారు రూ. 26 లక్షల కోట్ల పైగా డిపాజిట్లు, రూ. 18.5 లక్షల కోట్ల మేర అడ్వాన్స్‌లు (ఇచ్చిన రుణాలు) ఉంటాయి. విలీన బ్యాంకుకు మొత్తం 24,013 శాఖలు.. 58,000 పైచిలుకు ఏటీఎంలు, 36 దేశాల్లో 191 శాఖలు ఉంటాయి. 2,800 మందికి వీఆర్‌ఎస్‌..

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకానికి అర్హులైన ఉద్యోగులు 12,000 మంది పైగా ఉన్నప్పటికీ.. 2,800 మంది మాత్రమే ఇందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అరుంధతి భట్టాచార్య తెలిపారు. ఏప్రిల్‌ 5 దాకా ఈ స్కీము అమల్లో ఉంటుందని ఆమె వివరించారు. నిబంధనల ప్రకారం.. 20 ఏళ్ల సర్వీసు ఉండి, 55 ఏళ్ల వయస్సు గల వారు వీఆర్‌ఎస్‌ తీసుకునేందుకు అర్హులు.  విలీనంతో ఎస్‌బీఐ ఉద్యోగుల సంఖ్య 2,70,011కి పెరిగింది. ఇందులో 69,191 మంది ఉద్యోగులు అనుబంధ బ్యాంకులకు చెందినవారు.

తగ్గిన ఎస్‌బీఐ బేస్‌ రేటు 0.15 శాతం కట్‌.. ఇకపై 9.10 శాతం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ రుణాలపై వడ్డీ రేటుకు సంబంధించి బేస్‌ రేటును 0.15 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 9.25 శాతం నుంచి 9.10 శాతానికి దిగి వచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని వర్తింపచేస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. మరోవైపు, బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును (బీపీఎల్‌ఆర్‌) కూడా 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఇది 14 శాతం నుంచి 13.85 శాతానికి చేరింది. ఎంసీఎల్‌ఆర్‌ మాత్రం యథాతథంగా ఉంటుంది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ వారంలో పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం.

బేస్‌ రేటు ప్రాతిపదికన గృహ, వాహన రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు నెలవారీ కట్టే ఈఎంఐల భారం కనీసం 0.15% మేర తగ్గనుంది.  2016 ఏప్రిల్‌ 1కి ముందు రుణాలు తీసుకున్న వారికి బేస్‌ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత రుణాలు తీసుకున్న వారికి మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)వర్తిస్తుంది. ప్రస్తుతం ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8%గా, మూడేళ్ల వ్యవధికి 8.15%గానూ ఉంది. వీటిలో ఎలాంటి మార్పులు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement