రాయ్ పెరోల్ జూన్ 19 వరకూ పొడిగింపు
♦ జూన్ 15 నాటికి రూ.1,500 కోట్లు కట్టాలని సుప్రీం కోర్టు ఆదేశం
♦ లేదంటే మళ్లీ జైలుకేనని హెచ్చరిక
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను జూన్ 19వ తేదీ వరకూ సుప్రీంకోర్టు గురువారం పొడిగించింది. అయితే జూన్ 15కల్లా రూ.1,500 కోట్లు సెబీ–సహారా అకౌంట్‌కు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా స్పష్టం చేసింది. అలాగే జూలై 15వ తేదీలోపు మరో రూ.552.22 కోట్లు చెల్లించి, ఇందుకు అనుగుణంగా ఒక అఫడవిట్ దాఖలు చేయాలనీ స్పష్టం చేసింది. గత సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు రాయ్ గురువారం హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ తేదీన వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరుకావాలని స్పష్టం చేసింది.
తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి జైలు...
ఇదిలావుండగా, న్యూయార్క్‌లోని సహారా హోటల్ ప్లాజా కొనుగోలుకు– అంతర్జాతీయ రియల్టీ సంస్థ ఎంజీ క్యాపిటల్ హోల్డింగ్స్ సిద్ధమని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించి, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడచుకోలేకపోయిన ప్రకాశ్ స్వామి అనే వ్యక్తికి సుప్రీం నెల జైలు శిక్షను విధించింది. అమెరికాలో పదేళ్లు కరస్పాండెంట్‌గా పనిచేసిన చెన్నైకి చెందిన స్వామి అనే జర్నలిస్ట్ ఎంజీ క్యాపిటల్ హోల్డింగ్స్ తరఫున పవర్ ఆఫ్ అటార్నీగా అఫిడవిట్ దాఖలు చేస్తూ, హోటల్ కొనుగోలుకు ఆ సంస్థ సిద్ధమని పేర్కొన్నారు.
అయితే ఇందుకు నిజాయితీ నిరూపణగా రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందులో విఫలమైన స్వామిని ‘ధిక్కరణ కింద’ నెలపాటు తీహార్ జైలుకు పంపింది. తనకు చెప్పిన వివరాలను బట్టి, అఫిడవిట్ వేయాల్సి వచ్చిందని చేతులు జోడించి విన్నవించుకున్నప్పటికీ సుప్రీం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించలేదు. స్వేచ్ఛగా వదిలేస్తే.. తప్పుడు సందేశం పంపినట్లు అవుతుందని బెంచ్ వ్యాఖ్యానించింది.