ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: టాటా గ్రూపులోని లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సవివరణ ఇవ్వాలని సెబీ ఆదేశించింది. టాటా గ్రూపు చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ పదవుల నుంచి తొలగింపునకు గురైన సైరస్ మిస్త్రీ, నుస్లీ వాడియా ఈ ఆరోపణలు చేయగా, వారు ఈ విషయాలను సెబీ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీల నుంచి తాజా వివరణలు కోరడం గమనార్హం. నిర్దిష్ట వివరాలు, విరణలు అందజేయాలని సెబీ కోరింది. ఇప్పటికే ఈ అంశాలపై సెబీ ప్రాథమిక విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు టాటా కంపెనీలు ఇచ్చిన వివరణలను సెబీ పరిశీలించగా... లిస్టింగ్ నియమాల ఉల్లంఘనలు జరిగిన ఆధారాలు ఏవీ లభించలేదని ఓ అధికారి తెలిపారు. అయితే, ఇది ఇంకా పూర్తి కాలేదని, ఈ సమయంలో తుది ఫలితం ఏంటన్నది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదన్నారు. టాటా గ్రూపు యాజమాన్యం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో... ఇన్వెస్టర్లకు మరింత స్పష్టనిచ్చేందుకు గాను సెబీ గతవారం లిస్టెడ్ కంపెనీల బోర్డుల పరిధి, ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర విషయమై సమగ్ర మార్గదర్శక నోట్‌ను విడుదల చేసింది.