ఎన్‌ఎస్‌డీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రసేన్‌జిత్ ముఖర్జీ
సాక్షి, అమరావతి: దేశంలో నివసిస్తున్న అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా చేయూత నివ్వడమే కాకుండా తక్షణం అనేక పన్ను ప్రయోజనాలను కల్పిస్తోందని ఎన్‌ఎస్‌డీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రసేన్‌జిత్ ముఖర్జీ పేర్కొన్నారు. ఎన్‌పీఎస్‌లో సభ్యులుగా చేరడానికి ప్రభుత్వం పలు పన్ను రాయితీలను అందిస్తోందని, వీటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. శుక్రవారం విజయవాడలో ఎన్‌పీఎస్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఎన్‌పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుతో పాటు, సెక్షన్ 80సీసీడీ(1బీ) ప్రకారం అదనంగా రూ. 50,000 పన్ను ప్రయోజనం పొందవచ్చన్నారు. ఈ విధంగా ఈ రెండు సెక్షన్లద్వారానే గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పన్ను ప్రయోజనం లభిస్తుందన్నారు. ఇది కాకుండా నేరుగా యాజమాన్య సంస్థే జీతంలో నుంచి ఎన్‌పీఎస్‌కి కేటాయిస్తే దానిపై కూడా సెక్షన్ 80సీసీడీ(2) ద్వారా అదనపు పన్ను ప్రయోజనం పొందవచ్చన్నారు. బేసిక్ జీతంలో 10 శాతం ఎన్‌పీఎస్ కేటాయించడం ద్వారా ఈ సెక్షన్‌ను కూడా వినియోగించుకోవచ్చన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్‌పీఎస్‌లో 1.4 కోట్ల మంది సభ్యులుండగా, 1.70 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది.
విత్‌డ్రాయల్స్‌పై పన్ను తక్కువ
60 ఏళ్ల తర్వాత ఈ పథకం నుంచి వెనక్కి తీసుకున్న మొత్తంపై పన్ను భారం ఎక్కువగా ఉందన్నది అపోహ మాత్రమేనన్నారు. 60 ఏళ్ల తర్వాత పొదుపు చేసిన మొత్తంలో కనీసం 40 శాతం తప్పనిసరిగా యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాలన్నారు. ఇలా ఇన్వెస్ట్ చేసి మిగిలిన 60 శాతం వెనక్కి తీసుకుంటే ఇందులో 20 శాతం మొత్తం మీద మాత్రమే పన్ను భారం పడుతుందన్నారు. ఒకవేళ 60 శాతం యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి పన్ను భారం ఉండదని స్పష్టం చేశారు.