
8 నెలల కనిష్టానికి సెన్సెక్స్
♦ అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు
♦ ఈ ఏడాది కనిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీలు
♦ 245 పాయింట్ల నష్టంతో 26,523కు సెన్సెక్స్
♦ 71 పాయింట్ల నష్టంతో 8,044కు నిఫ్టీ
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది సెప్టెంబర్ కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచుతుందనే ఆందోళనతో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. దీనికి కరువు భయాలు కూడా తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు క్షీణించి 26,523 పాయింట్లకు పడిపోయింది. ఇది ఎనిమిది నెలల కనిష్ట స్థాయి. గత మంగళవారం నుంచి సెన్సెక్స్ మొత్తం 1,326 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 8,044 పాయింట్లకు క్షీణించింది. నిఫ్టీ కీలకమైన 8,100 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ రెండూ సూచీలకు ఇది ఈ ఏడాది కనిష్ట స్థాయి. వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లోనూ సెన్సెక్స్ నష్టాలపాలయ్యింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల, ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఫార్మా షేర్లు పతనమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా ప్రభావం చూపింది.
సన్ టీవీ 22 శాతం డౌన్..
డీలిస్టింగ్ వార్తలతో ఈరోస్ ఇంటర్నేషనల్ 12 శాతం ఎగసింది. మేలో చైనా ఎగుమతులు క్షీణించడంతో మెటల్, మైనింగ్ షేర్లు పడిపోయాయి. సన్ టీవీ నెట్‌వర్క్‌కు చెందిన 33 చానెళ్లకు సెక్యూరిటీ క్లియరెన్స్‌లు ఇవ్వడానికి హోమ్ మంత్రిత్వ శాఖ నిరాకరించిందన్న వార్తలతో ఈ కంపెనీ షేర్ 22 శాతం క్షీణించి రూ.279 కు చేరింది. మ్యాగీ ప్రభావం నెస్లే ఇతర బ్రాండ్లపై పడుతుందనే అంచనాలతో నెస్లే ఇండియా షేర్ 7.6 శాతం వరకూ నష్టపోయింది. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.1,873 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.12,894 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,63,736 కోట్లుగా నమోదైంది.
ఏడేళ్ల గరిష్టానికి షాంగై: అంతర్జాతీయ రుణదాతలతో బెయిలవుట్ డీల్ కుదుర్చుకోవడంలో గ్రీస్ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా షాంఘై ఇండెక్స్ 2 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్టాన్ని చేరింది
మూడు ఐపీఓలకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, గత వారంలో మూడు ఐపీఓలకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సెబీ 17 ఐపీఓలకు అనుమతిచ్చినట్లయింది. తాజాగా ఐపీఓకు ఆమోదం పొందిన కంపెనీలు- హిందీ దినపత్రిక అమర్ ఉజాలాను ప్రచురించే అమర్ ఉజాలా పబ్లికేషన్స్, మౌలిక రంగ కంపెనీ దిలిప్ బిల్డ్‌కాన్, కల్పతరు పవర్ ట్రాన్సిమిషన్స్ అనుబంధ కంపెనీ శ్రీ శుభం లాజిస్టిక్స్. దిలిప్ బిల్డ్‌కాన్ కంపెనీ రూ.650 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఆఫర్ ఫర్ సేల్ కింద 1.49 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. శ్రీ శుభం లాజిస్టిక్స్ రూ.210 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 70 లక్షల షేర్లను జారీ చేయనున్నది. ఇక అమర్ ఉజాలా రూ.50 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, 26.9 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జారీ చేయనున్నది.