7,750 దిగువకు నిఫ్టీ
♦ నాలుగో రోజూ నష్టాలే
♦ వెంటాడుతున్న ఫెడ్ భయాలు
♦ 72 పాయింట్ల నష్టంతో 25,230కు సెన్సెక్స్
♦ 19 పాయింట్లు నష్టపోయి 7,731కు నిఫ్టీ
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందనే భయాలకు తోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు క్షీణించడం ఇది వరుసగా నాలుగోసారి. బీఎస్‌ఈ సెన్సెక్స్ రెండు వారాల కనిష్ట స్థాయికి పతనం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,750 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో చివరకు సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి 25,230 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 7,731 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఫార్మా, రియల్టీ, వాహన, లోహ, టెక్నాలజీ, ఆయిల్ షేర్లు నష్టపోయాయి.
ఎఫ్‌ఎంసీజీ షేర్లు లాభపడ్డాయి.
మరింతగా ఒడిదుడుకులు..: బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఒక దశలో 180 పాయింట్లు లాభపడింది. పై స్థాయలో లాభాల స్వీకరణ జరగడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఈ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 549 పాయింట్లు నష్టపోయింది. మే నెల డెరివేటివ్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనున్నందున ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. ముడి చమురు ధరల పతనం కూడా ప్రతికూల ప్రభావం చూపింది.
ఐటీసీ 5% అప్..: అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలు, బోనస్ షేర్ల ప్రకటన అంశాల నేపథ్యంలో ఐటీసీ షేర్ దూసుకుపోయింది. ఇంట్రాడేలో రూ.355 గరిష్టాన్ని తాకిన ఈ షేర్ చివరకు 5% లాభంతో రూ.347 వద్ద ముగిసింది. ఐటీసీ షేర్‌ను రూ.385 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని క్రెడిట్ సూసీ, రూ.390 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని సిటి సంస్థలు అప్‌గ్రేడ్ చేయడం ఈ షేర్ జోరును మరింతగా పెంచింది.