నాలుగో రోజూ నష్టాలే
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను డిసెంబర్‌లోనే పెంచే అవకాశాలున్నాయన్న సంకేతాలు గురువారం స్టాక్‌మార్కెట్‌ను పడగొట్టాయి. దీనికి అక్టోబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు కూడా తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి26,838 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 8,112పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఈ నెల 14 తర్వాత ఇదే కనిష్ట ముగింపు. నిఫ్టీకి ఇది ఒక నెల కనిష్ట స్థాయి. సెన్సెక్స్ 27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. నిఫ్టీ ఇంట్రాడేలో 8,100 పాయింట్ల దిగువకు పతనమైంది.
డాలర్‌తో రూపాయి మారకం 27 పైసలు క్షీణించడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడం...తదితర అంశాలు ప్రభావం చూపాయి. బ్యాంక్, విద్యుత్తు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, లోహ, రిఫైనరీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 633 పాయింట్లు నష్టపోయింది. కాగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చే నెల 6న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్‌కానున్నట్లు సమాచారం.