ఈ ఏడాదికి ఈక్విటీలే మంచివి!
2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభ ఛాయలు మళ్లీ కనిపిస్తున్నాయా?... భారీగా పడుతున్న ముడి చమురు ధరలు, నెమ్మదించిన చైనా పరుగులు... తగ్గుతున్న కమోడిటీ ధరలు, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల దిగువ చూపులు... ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని చెపుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే ఇండియా వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధుల రాక తగ్గుతుంది. 2014లో మంచి లాభాలను అందించిన ఈక్విటీలు 2015లో మాత్రం నష్టాలనిచ్చాయి.
మార్చిలో నమోదు చేసిన గరిష్ట స్థాయి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 శాతం నష్టపోయాయి. మరో పక్క బంగారం ధరలూ కనిష్ట స్థాయి వద్ద పరిమిత శ్రేణిలో కదులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి ఏ పథకాలు అనువుగా ఉంటాయో ఒకసారి చూద్దాం....
* రెండు మూడేళ్ల దీర్ఘకాలానికే ఇన్వెస్ట్ చేయాలి
* స్వల్పకాలానికైతే బంగారం; రియల్టీ కూడా వద్దు
ఆకర్షణీయంగా డెట్ ఫండ్స్..
వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు డెట్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. ఎందుకంటే బాండ్ రేట్లు వడ్డీరేట్ల కదలికలకు వ్యతిరేక దిశలో కదులుతాయి. కాబట్టి వడ్డీరేట్లు తగ్గుతుంటే బాండ్ రేట్లు పెరగడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. చేతిలో నగదు ఉండి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే వారు మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్స్ కేసి చూడొచ్చు. అంతేకాదు అధికాదాయ పన్ను శ్లాబులో ఉన్న వారికి డెట్ ఫండ్స్ ఒక చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చెప్పొచ్చు. ఇన్వెస్ట్ చేసిన 36 నెలల తర్వాత వైదొలిగితే ఇండక్సేషన్ లేకుండా 10 శాతం, ఇండక్సేషన్ పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
మెరుపు తగ్గిన బంగారం..
2008-2012 మధ్యకాలంలో బాగా మెరిసిన బంగారం.. గత కొన్నేళ్లుగా వెలవెలపోతోంది. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు, దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు వచ్చిన సందర్భాల్లో బంగారంలో పెట్టుబడులను సురక్షితమైనవిగా భావిస్తారు. ఈ విధంగా ఆలోచించి కొంత మొత్తం బంగారంలో కేటాయించవచ్చు. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి గోల్డ్ బాండ్స్ ఒక చక్కటి సాధనం. 2.75 శాతం వడ్డీ వస్తోంది. కానీ బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందన్న విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి...
స్వల్ప కాలానికి నో ‘రియల్’
ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించిన పెట్టుబడి సాధనాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. 2004-13 మధ్య కాలంలో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం మంచి లాభాలను అందించింది. కానీ రియల్ ఎస్టేట్ అనేది ఒక నిర్దిష్టమైన పెట్టుబడి పథకం కాదు. మీరు కొనే ప్రాంతం.. అక్కడి పరిస్థితులను బట్టి రేటు మారుతుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై రాబడి అనేది ఒకే విధంగా ఉండదు. దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించే సాధనాల్లో రియల్ ఎస్టేట్ ఒకటిగా చెప్పుకోవచ్చు. స్వల్ప కాలానికి అంత ఆకర్షణీయంగా లేదు. ప్రస్తుత పరిస్థితే కొనసాగుతుంది.
ఒడిదుడుకులుంటాయి..
ప్రస్తుత మార్కెట్లు చాలా బలహీనంగా, బేరిష్‌గా ఉన్నాయి. కానీ మా అంచనా ప్రకారం మార్కెట్ల పతనం చివరి దశకు వచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి జరిగితే మరో 5 శాతం పతనం కావచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు కుదుట పడితే తిరిగి మార్కెట్లు ర్యాలీ చేయడం ప్రారంభిస్తాయి. జీఎస్‌టీ బిల్లును ప్రభుత్వం ఆమోదింప చేయలేనప్పటికీ మిగిలిన సంస్కరణల విషయంలో సరైన దారిలోనే వెళుతోంది. బొగ్గు, స్పెక్ట్రమ్ వేలం, డిస్కంల రుణ సమస్యలు పరిష్కరించడం వంటి విషయాల్లో సంస్కరణలు చేపట్టింది.
ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేస్తోంది. వచ్చే బడ్జెట్‌లో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 2016 సంగతి ఎలా ఉన్నా... దీర్ఘకాలంలో లాభాలుంటాయి. రెండు మూడేళ్ల దృష్టిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చు. సిస్టమాటిక్ విధానంలో మ్యూచువల్ ఫండ్ మార్గంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.
- వి.కె.విజయకుమార్
ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్