ముంబై : మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు ముందుగా ఊహించిన మాదిరిగానే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా నిర్ణయం వెలువరించడంతో, మార్కెట్లలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. సాధారణంగానే సెన్సెక్స్, నిఫ్టీలు కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 82.99 పాయింట్ల లాభంతో, 26,860 వద్ద, నిఫ్టీ 24.65 లాభంతో 8,225 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
నేడు జరిగిన ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ రెపోను 6.50శాతం, సీఆర్ఆర్ 4 శాతంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజన్ నిర్ణయం స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కేవలం భవిష్యత్ లో రేట్లు ఎలా ఉండబోతున్నాయో అనే ప్రకటనపైనే దలాల్ స్ట్రీట్ దృష్టిసారించింది.
ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ యూఎల్, హీరో మోటార్ కార్పొరేషన్, ఓఎన్ జీసీ మార్కెట్లో లాభాలను పండిస్తుండగా.. యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, హెచ్ డీఎఫ్ సీ, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. మరోవైపు పసిడి, వెండి ధరలు నష్టాల బాట పట్టాయి. పసిడి ధర రూ.65నష్టపోతూ రూ.29385 వద్ద, సిల్వర్ రూ.108 నష్టంతో రూ.39,034వద్ద నమోదవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.84గా ఉంది.