లాభాల నుంచి నష్టాల్లోకి..
సెన్సెక్స్ 134 పాయింట్లు డౌన్
28,560 వద్ద ముగింపు
పసిడి షేర్ల వెలుగు
రియల్టీ షేర్ల బేజారు
నాలుగు రోజుల లాభాల తరువాత మళ్లీ మార్కెట్లు నష్టపోయాయి. తొలుత లాభాలతోనే మొదలైనా మిడ్ సెషన్ వరకూ స్వల్ప ఒడిదుడుకుల కు లోనయ్యాయి. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ ఇంట్రాడేలో 8,623 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ సైతం 116 పాయింట్లు లాభపడి గరిష్టంగా 28,810కు చేరింది. ఆపై చివరి గంటన్నరలో అమ్మకాలు పెరగడంతో సూచీలు లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా నష్టాలు చవిచూశాయి. వెరసి సెన్సెక్స్ 134 పాయింట్లు క్షీణించి 28,560 వద్ద నిలవగా, 32 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 8,556 వద్ద స్థిరపడింది. చైనా తయారీ రంగ మందగమనం కొనసాగడంతోపాటు, రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు చివర్లో అమ్మకాలకు మొగ్గుచూపారు.
పవర్, మెటల్, ఆయిల్ డీలా
బీఎస్‌ఈలో ప్రధానంగా పవర్, మెటల్, ఆయిల్ రంగాలు 2%పైగా పతనమయ్యాయి. మరోవైపు వినియోగ వస్తు రంగం 3.3% ఎగసింది. పసిడి దిగుమతులపై ఆంక్షలు తొలగడం ఇందుకు దోహదపడింది. జ్యువెలరీ షేర్లు గీతాంజలి, టీబీజెడ్ 20% చొప్పున దూసుకెళ్లగా, టైటన్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, తంగమాయిల్, తారా, పీసీ జ్యువెలర్స్ 5-3% మధ్య లాభపడ్డాయి.
ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, హిందాల్కో, భెల్, రిలయన్స్, టాటా పవర్, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, సెసాస్టెరిలైట్, హెచ్‌డీఎఫ్‌సీ 4-2% మధ్య నష్టపోగా, హీరోమోటో, హెచ్‌యూఎల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ 3.5-1.5% మధ్య పురోగమించాయి. మరోవైపు ఆర్‌బీఐ సమీక్షలో వడ్డీ తగ్గింపు ఉండకపోవచ్చునన్న అంచనాలతో రియల్టీ షేర్లు ఇండియాబుల్స్, యూనిటెక్, హెచ్‌డీఐఎల్ 5-4% మధ్య దిగజారాయి. కాగా, డెరైక్టర్ పదవికి విజయ్ మాల్యా రాజినామా చేయడంతో మంగళూర్ కెమికల్స్ షేరు 9% జంప్‌చేసింది.