రిఫరెండం ముందు ఒడుదుడుకులు
రోజంతా హెచ్చుతగ్గులు
స్వల్ప తగ్గుదలతో ముగిసిన సూచీలు
ముంబై: బ్రిటన్ రిఫరెండం జరిగే రోజు దగ్గరపడుతుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్‌లో ఒడుదుడుకుల కు నెలకొన్నాయి. రోజంతా స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 26,617-26,887 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 47 పాయింట్ల క్షీణతతో 26,766 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 8,153-8,138 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు 16 పాయింట్లు కోల్పోయి 8,204 పాయింట్ల వద్ద ముగిసింది. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగవచ్చన్న ఆశావహ అంచనాలతో మెజారిటీ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వున్నప్పటికీ, వారు జాగురూకతతో వ్యవహరిస్తున్నారని, దాంతో ట్రేడింగ్ మందకొడిగా సాగిందని బీఎన్‌పీ పారిబాస్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు.
టాటా మోటార్స్ 2.5 శాతం డౌన్..: బ్రిటన్ వైదొలిగితే ఆ దేశంలో జాగ్వర్ లాండ్ రోవర్ బ్రాండ్ల ఉత్పత్తి చేస్తున్న టాటా మోటార్స్‌పై అధిక ప్రభావం పడుతుందన్న అంచనాలతో ఈ షేరులో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారు. దాంతో సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా టాటా మోటార్స్ 2.58 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. ఈ జూన్ నెలలో ఇప్పటివరకూ ఈ షేరు 20 శాతం పెరిగిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటుచేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. గెయిల్, హెచ్‌యూఎల్, ఐటీసీలు 1-2 శాతం మధ్య తగ్గాయి. అదాని పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ లాబ్, కోల్ ఇండియా, లుపిన్ షేర్లు 1-2 శాతం మధ్య పెరిగాయి.