ఒకవైపు కరెన్సీ అడ్డూ అదుపూ లేకుండా పడిపోతోంది. మొన్నటివరకూ 68–70 రూపాయలే ఎక్కువనుకుంటే... ఇపుడు ఏకంగా డాలర్‌తో పోలిస్తే 74 రూపాయల స్థాయికి పడిపోతోంది. దీనికితోడు ముడిచమురు ధర రోజురోజుకూ ఎగుస్తోంది. ఇవన్నీ కలిసి ఆర్‌బీఐ ప్రకటించనున్న క్రెడిట్ పాలసీపై ఆందోళనల్ని పెంచేశాయి. ఫలితం... గురువారం స్టాక్ మార్కెట్ కుదేలయింది. అంతర్జాతీయ సంకేతాలూ ప్రతికూలంగా ఉండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 35,200 పాయింట్లు దిగువకు పడిపోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పతనమై, 10,600 పాయింట్ల దిగువకు చేరింది. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, వాహన షేర్లన్నీ నష్టపోయాయి. లోహ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టాలకు ఎదురీది స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 806 పాయింట్లు (2.24%) నష్టపోయి 35,169 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 259 పాయింట్లు (2.39 శాతం) క్షీణించి 10,599 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలకు ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. గురువారం ట్రేడింగ్‌లో ఒకదశలో సెన్సెక్స్ 954 పాయింట్లు, నిఫ్టీ 311 పాయింట్లు నష్టపోయాయి.
శిఖర స్థాయి నుంచి 10 శాతం పతనం...
డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ట స్థాయి, 73.81కు పడిపోవడం, ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి ఎగియడంతో మన కరెంట్ అకౌంట్ లోటుపై ఆందోళన తారస్థాయికి చేరింది. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాల సునామీ చోటు చేసుకుంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా మొదలు కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఆగస్టులో స్టాక్ సూచీలు శిఖర స్థాయిలకు చేరాయి. అయితే ఆ స్థాయి నుంచి చూస్తే, సూచీలు దాదాపు 10 శాతం పతనమయ్యాయి.
అక్కడ కొనుగోళ్ల కోసం ఇక్కడ అమ్మకాలు...
గత రెండు రోజుల్లో అత్యంత ఉత్తమమైన బ్లూ చిప్ షేర్లలో కూడా అమ్మకాలు చోటు చేసుకోవడం... స్టాక్ మార్కెట్లో నిరాశావాదం, నెగిటివ్ సెంటిమెంట్‌లు ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తోందని సెంట్రమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎనలిస్ట్ దేవాంగ్ మెహతా వ్యాఖ్యానించారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందనే భయాలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో నేటి ఆర్‌బీఐ పాలసీ దూకుడుగా ఉండొచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని మెహతా వివరించారు. అమెరికాలో బాండ్ల రాబడులు పెరగడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్న గణాంకాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు అక్కడ ఇన్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ అమ్మకాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు రూపాయి పతనం, ముడి చమురు భగభగలు ఆగే సూచనలు లేకపోవడంతో స్టాక్ సూచీల పతనం మరింతగా కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌పై బేర్‌ల
పట్టు బిగుస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. నేక్‌డ్ ఫ్యూచర్ల జోలికి పోకుండా ఆప్షన్స్ ట్రేడింగ్‌కు ప్రాధాన్యమివ్వాలని ఆయన ట్రేడర్లకు సూచించారు. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నదని, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు దూరంగా ఉండటమే మంచిదని డాల్టన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎమ్‌డీ యూ.ఆర్. భట్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని విశేషాలు..
►రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 7 శాతం నష్టంతో రూ.1,121 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 8.3 శాతం నష్టపోయింది. ఈ షేర్ ఇంట్రాడేలో ఈ స్థాయిలో నష్టపోవడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
►సెన్సెక్స్ 31 కంపెనీల షేర్లలో ఆరు షేర్లు లాభపడగా, 24 షేర్లు నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు పెరిగాయి.
► నిఫ్టీ షేర్లలో 11 షేర్లు లాభపడగా, 39 షేర్లు నష్టపోయాయి.
►అన్ని షేర్లు నష్టాల పాలైనప్పటికీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ మాత్రం 4 శాతం లాభపడి రూ. 316 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడిన షేర్ ఇదే. ఈ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ పదవులకు చందా కొచ్చర్ రాజీనామా చేయడమే దీనికి కారణం.
►షేర్ల బైబ్యాక్ ధరను రూ.1,475గా నిర్ణయించామని వెల్లడించిన నేపథ్యంలో ఎల్ అండ్ టీ షేర్ 1 శాతం లాభంతో రూ.1,259 వద్ద ముగిసింది. ఈ షేర్ల బైబ్యాక్‌కు రికార్డ్ డేట్‌గా ఈ నెల 15ను కంపెనీ నిర్ణయించింది.
► దాదాపు 500కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ ఇండియా, హీరో మోటొకార్ప్, ఐషర్ మోటార్స్, అపోలో టైర్స్, సియట్, మదర్సన్ సుమి, డీఎల్‌ఎఫ్, ఒబెరాయ్ రియల్టీ, భారతీ ఎయిర్‌టెల్, అరవింద్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, హడ్కో, ఇండిగో షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► వడ్డీ రేట్ల ప్రభావిత– రియల్టీ, వాహన, ఆర్థిక రంగ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ షేర్ల సూచీలు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయంటే అమ్మకాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
►టైర్లు, పెయింట్లు, రసాయనాల కంపెనీల షేర్లు నష్టపోయాయి. ఈ ఉత్పత్తులకు ముడి పదార్ధాలుగా ముడి చమురు వినియోగమవుతుండటమే దీనికి కారణం.
►పలు షేర్లు తాజా ఏడాది గరిష్ట స్థాయిల నుంచి చూస్తే ప్రస్తుతం 60 శాతానికి పైగా నష్టపోయాయి. జెట్ ఎయిర్‌వేస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇన్ఫీబీమ్ అవెన్యూస్, పీసీ జ్యుయలర్, మన్‌పసంద్ బేవేరేజేస్, అబాన్ ఆఫ్‌షోర్, కైటెక్స్ గార్మెంట్స్, వొడాఫోన్ ఐడియా, ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా, బీఈఎమ్‌ఎల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ఆప్‌టెక్, అవంతీ ఫీడ్స్.. ఈ జాబితాలో ఉన్నాయి.
2 రోజుల్లో 5 లక్షల కోట్లు ఆవిరి
గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,357 పాయింట్లు నష్టపోయింది. ఈ రెండు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,02,896 కోట్లు హరించుకుపోయి రూ.1,40,39,743 కోట్లకు పడిపోయింది. ఒక్క గురువారం రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.3.31 లక్షల కోట్లు ఆవిరైంది.
ఎందుకీ నష్టాలు...
రూపాయి పతనం
రూపాయి పతనం కొనసాగుతోంది. ఇంట్రాడేలో జీవిత కాల కనిష్ట స్థాయి, 73.82కు పడిపోయిన రూపాయి చివరకు 24 పైసల నష్టంతో 73.58 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి 16 శాతం పతనమైంది. ఆసియా కరెన్సీల్లో అత్యధికంగా నష్టపోయింది మన రూపాయే. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ చమురు 86 డాలర్లుగా ఉందని, ఇది 88–90 స్థాయిలకు పెరిగితే, రూపాయి 75కు పతనమవుతుందని ఎడిల్‌వేజ్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ సజల్ గుప్తా అంచనా వేశారు.
ముడి చమురు ధరలు భగ్గు
ఒక పీపా బ్రెంట్ చమురు ధరలు 2 శాతం వరకూ ఎగసి నాలుగేళ్ల గరిష్ట స్థాయి, 86.10 డాలర్లకు పెరిగాయి. ముడి చమురు ధరలు ఎగబాకితే దిగుమతుల బిల్లు పెరిగి కరంట్ అకౌంట్ లోటు మరింతగా విస్తరిస్తుందని, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయని భయాలు చెలరేగాయి.
ఆర్‌బీఐ రేట్ల పెంపు
రూపాయి పతనం, ముడి చమురు ధరలు పెరుగుదల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా ఆర్‌బీఐ నేడు (శుక్రవారం) కీలక రేట్లను పావు శాతం మేర పెంచనున్నదన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే ఆర్‌బీఐ 0.25 శాతం మేర రేట్లను పెంచుతుందనే అంచనాలను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసిందని నిపుణులంటున్నారు. వివిధ అంశాలపై ఆర్‌బీఐ స్వరం ఎలా ఉండనున్నదనేది ఇప్పుడు మార్కెట్‌కు కీలకం కానున్నదని వారు చెప్పారు.
పెరుగుతున్న బాండ్ల రాబడులు
బాండ్ల రాబడులు(ఈల్డ్స్) పెరుగుతుండటం ఈక్విటీమార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పదేళ్ల బాండ్ల రాబడులు 8.18 శాతం రేంజ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ బాండ్ల రాబడులు 84 బేసిస్ పాయింట్లు ఎగిశాయి.
ప్రపంచ మార్కెట్ల పతనం
అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలను మించడంతో డాలర్ 11 నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. అక్కడి బాండ్ల రాబడులు ఏడేళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో రేట్ల పెంపు అంచనాలు బలపడ్డాయి. దీనికి ఇటలీ బడ్జెట్ భయాలు కూడా తోడవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన ఈక్విటీ మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,489 కోట్ల నికర పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో రెండు ట్రేడింగ్ రోజుల్లోనే రూ.455 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
హెవీ వెయిట్స్ నష్టాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 7 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ 806 పాయింట్ల నష్టంతో ఈ షేర్ వాటానే నాలుగో వంతు (275పాయింట్ల) వరకూ ఉంది. ఇక సెన్సెక్స్ నష్టాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటా 144 పాయింట్లు, టీసీఎస్ 106 పాయింట్లు, ఇన్ఫోసిస్ 82 పాయింట్లు, ఐటీసీ 63 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ 40 పాయింట్లుగా ఉన్నాయి.
టెక్నికల్ అంశాలు
నిఫ్టీ కీలకమైన 200 రోజుల మూవింగ్ యావరేజ్‌ను (10,785 పాయింట్ల) దాటి పతనం కావడం అమ్మకాలకు మరింత ఊపునిచ్చింది. నిఫ్టీ 10,785 పాయింట్ల పైన నిలదొక్కుకోలేకపోతే, మరింత పతనం తప్పదని, 10,557 పాయింట్లు తదుపరి మద్దతు స్థాయి అని చార్ట్‌వ్యూ ఇండియా డాట్ ఇన్ ఎనలిస్ట్ మజర్ మహ్మద్ పేర్కొన్నారు.
జైట్లీ వ్యాఖ్యలతో చమురు షేర్లు ఢమాల్
పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ పన్నులను కేంద్రం లీటర్‌కు రూ.1.50 తగ్గించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటర్‌కు రూ. 1 చొప్పున భారాన్ని భరించాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లను నష్టాల పాలు చేశాయి. ట్రేడింగ్ చివరివరకూ మార్కెట్ నష్టాలకు ఎదురీదిన ఈ షేర్లు చివరి ఇరవై నిమిషాల్లో జైట్లీ ప్రకటన కారణంగా ఏకంగా 20 శాతం వరకూ పతనమయ్యాయి. చివర్లో మార్కెట్ సగటు కారణంగా కొంత కోలుకున్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 11–13% రేంజ్‌లో నష్టపోయి ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment