మార్కెట్‌లో లాభాల ర్యాలీ...
Published Tue, Sep 12 2017 3:54 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
సాక్షి, ముంబై : ప్రపంచ మార్కెట్ల దూకుడుతో జోరుగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 32వేల మైలురాయిని చేధించిన సెన్సెక్స్, ట్రేడింగ్ చివరికి కూడా 276.50 పాయింట్లు పైకి జంప్ చేసి 32,158 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 87 పాయింట్ల లాభంలో 10,100 మార్కుకు సమీపంలో 10,093 వద్ద క్లోజైంది. మెటల్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్ల ర్యాలీతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ మార్కెట్లు లాభాల పంట పండించాయి. అదేవిధంగా మధ్యాహ్నం ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు షేర్లలో కొనుగోలు జోరు కొనసాగింది.
వరుసగా ఆరో సెషన్‌లోనూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభాల వర్షం కురిపించడంతో, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఈ బ్యాంకు టెక్ దిగ్గజం టీసీఎస్‌ను అధిగమించింది. రెండు సూచీల్లోనూ టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, బీపీసీఎల్, గెయిల్ టాప్ గెయినర్లుగా నిలువగా.. విప్రో, హీరో మోటోకార్ప్, ఇండస్‌ఇండ్ బ్యాంకు నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 64 రూపాయలుగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 54 రూపాయల నష్టంలో రూ.29,879గా ఉన్నాయి.
Advertisement
Advertisement