
స్టాక్ మార్కెట్లు (ఫైల్ ఫోటో)
ముంబై : వరుస రెండు సెషన్ల నుంచి ఆర్జించిన లాభాలను మార్కెట్లు కోల్పోయాయి. మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 206 పాయింట్లు పడిపోయి 33వేల మార్కు దిగువన 32,969 వద్ద క్లోజైంది. నిఫ్టీ 63 పాయింట్ల నష్టంలో 10,121 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్‌లో టాటా స్టీల్, వేదంతా, ఐసీఐసీఐ సెక్యురిటీస్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్ 1 శాతం నుంచి 3 శాతం మధ్యలో నష్టాలు పాలవ్వగా.. విప్రో, టెక్ మహింద్రా 4 శాతం వరకు లాభపడ్డాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ కూడా ఒక శాతం మేర నష్టపోయింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో రూ.772 కోట్ల రుణాలు అక్రమంగా జారీ అయినట్టు వెల్లడి కాగానే ఆ బ్యాంకు షేర్లు కూడా 5.4 శాతం మేర క్షీణించాయి. ఐడీబీఐ బ్యాంకు దెబ్బకు అటు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలు పాలయ్యాయి. అటు ప్రపంచ మార్కెట్లు సైతం నేడు బలహీనంగానే ఉండటంతో, దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు.