సూచీల సరికొత్త రికార్డు
స్టాక్ మార్కెట్లో సరిగ్గా రెండు వారాలు గడిచేటప్పటికి పాత రికార్డులు బద్దలయ్యాయి. ప్రధానంగా ఐటీ రంగ షేర్లకు పెరిగిన డిమాండ్‌తో మార్కెట్లు వరుసగా ఏడో రోజు పుంజుకున్నాయి. వెరసి అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ సరికొత్త రికార్డులను లిఖించాయి. 121 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ తొలిసారి 26,147 వద్ద నిలవగా, 28 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ 7,796 వద్ద స్థిరపడింది. ఇంతక్రితం జూలై 7న 26,100 పాయింట్ల వద్ద ముగియడం ద్వారా సెన్సెక్స్, 7,787 వద్ద నిలవడం ద్వారా నిఫ్టీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
అయితే జూలై 8న ఇంట్రాడేలో నమోదైన 26,190ను సెన్సెక్స్ అధిగమించాల్సి ఉండగా, అదే రోజు నిఫ్టీ సాధించిన ఇంట్రాడే రికార్డ్(7,808)ను తాజాగా 7,809కు చేరడం ద్వారా తుడిచిపెట్టింది. వరుసగా ఏడు రోజుల్లో సెన్సెక్స్ 1,140 పాయింట్లు జమ చేసుకోవడం చెప్పుకోదగ్గ విశేషం! ఇలా ఇంతక్రితం 2012 సెప్టెంబర్‌లో మాత్రమే వరుసగా లాభాలు సాధించింది.
యూఎస్ గణాంకాల ఎఫెక్ట్
అమెరికా ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటున్న సంకేతాలనిస్తూ జూన్ నెలకు అటు ద్రవ్యోల్బణ గణాంకాలు, ఇటు గృహ రంగ కొనుగోళ్లు ప్రోత్సాహకరంగా నమోదయ్యాయి. దీంతో దేశీ సాఫ్ట్‌వేర్ రంగ కంపెనీలకు అతిపెద్ద ఔట్‌సోర్సింగ్ మార్కెట్‌గా నిలుస్తున్న అమెరికా ఆర్థిక పురోగతిపై అంచనాలు పెరిగాయి. ఫలితంగా ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగి బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 2.2% ఎగసింది. ప్రధానంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మైండ్‌ట్రీ, ఎంఫసిస్ 3.5-1.5% మధ్య లాభపడ్డాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు హిందాల్కో, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో, హీరోమోటో, ఎంఅండ్‌ఎం 2.5-1.5% మధ్య బలపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్, టాటా పవర్, మారుతీ, ఓఎన్‌జీసీ, యాక్సిస్ 1% స్థాయిలో నీరసించాయి.
జెట్ అప్, ఐఎన్‌జీ డౌన్
రానున్న మూడేళ్లలో లాభాల బాటపట్టనున్నట్లు కంపెనీ ప్రకటించడంతో జెట్ ఎయిర్‌వేస్ షేరు 3% ఎగసింది. అయితే ఫలితాలు నిరుత్సాహపరచడంతో కేపీఐటీ టెక్నాలజీస్ 11% పతనంకాగా, పొలారిస్ 7%, సియట్ 7%, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ 3% చొప్పున నష్టపోయాయి. ఇతర మిడ్ క్యాప్స్‌లో అతుల్, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్, జిందాల్ సా, ఫైనాన్షియల్ టెక్, హెచ్‌సీఎల్ ఇన్ఫో 13-7% మధ్య దూసుకెళ్లాయి. ఎఫ్‌ఐఐలు రూ. 652 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.