తొలి లాభాలు ఆవిరి
ఫెడ్ ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణపై సందిగ్దత కొనసాగడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాలతో ముగిసాయి. నిరుద్యోగుల సంఖ్య తగ్గినట్లు గత రాత్రి అమెరికాలో డేటా వెలువడటంతో అక్కడి మార్కెట్ ర్యాలీ జరిపిన నేపథ్యంలో శుక్రవారంనాడిక్కడ ట్రేడింగ్ తొలిదశలో సూచీలు పెరిగాయి. ఒకదశలో 159 పాయింట్లవరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ముగింపు సమయంలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొని 20,217 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 12 పాయింట్లు నష్టపోయింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలుత 6,050 స్థాయివరకూ పెరిగి, చివరకు 3 పాయింట్ల నష్టంతో 5,995 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గత మూడురోజుల్లో 673 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ నష్టాలతో ముగియడం వరుసగా ఇది మూడోవారం. ఈ వారంలో తొలి రెండురోజుల్లో ర్యాలీ జరపడంతో చివరకు అంతక్రితంవారంకంటే 182 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ మరింత పెరగకపోవొచ్చన్న అంచనాలు, మరో నాలుగురోజుల్లో నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండటంతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నెలరోజుల నుంచి అదేపనిగా పెట్టుబడులు చేస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) హఠాత్తుగా కొనుగోళ్లు నిలిపివేయడం కూడా క్షీణతకు కారణమని ఆ వర్గాలు వివరించాయి. క్రితం రోజు రూ. 60 కోట్లు నికర విక్రయాలు జరిపిన ఎఫ్‌ఐఐలు శుక్రవారం రూ. 3 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కుతీసుకున్నట్లు సెబి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లు తగ్గాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐలు 1-3% మద్య క్షీణించాయి. మెటల్ షేర్లలో సేసా స్టెరిలైట్, ఎన్‌ఎండీసీలు తగ్గగా, టాటా స్టీల్, జిందాల్ స్టీల్‌లు పెరిగాయి.
6,000 స్ట్రయిక్‌పై టార్గెట్
ఎన్‌ఎస్‌ఈ స్పాట్ నిఫ్టీ వరుసగా రెండోరోజు 6,000 స్థాయికి అటూఇటూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, దాదాపు క్రితంరోజులానే శుక్రవారం కూడా నిఫ్టీ ఆ స్థాయి దిగువన ముగిసింది. అయినా 6,000 స్థాయి టార్గెట్‌గా అటు కాల్, పుట్ ఆప్షన్ల రైటింగ్ జోరుగా సాగింది. దాంతో ఈ పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 9.03 లక్షల షేర్లు (16 శాతం) యాడ్‌కాగా, మొత్తం ఓఐ 66.44 లక్షల షేర్లకు పెరిగింది. కాల్ ఆప్షన్ ఓఐలో 10.69 లక్షల షేర్లు (33 శాతం) యాడ్‌కాగా, మొత్తం ఓఐ 42,50 లక్షల షేర్లకు చేరింది. డెరివేటివ్ మార్కెట్లో చురుగ్గా ట్రేడ్‌చేసే విదేశీ ఇన్వెస్టర్లు నిఫ్టీని ఈ స్థాయి నుంచి ఎటుతీసుకెళ్లాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ వచ్చే గురువారం ముగియనున్నందున, ఇదేస్థాయి వద్ద నిఫ్టీని నిలిపివుంచడం సాధ్యం కూడా కాదు. అందుచేత వచ్చే వారం ప్రధమార్థంలో నిఫ్టీ 6,000స్థాయిపైన నిలదొక్కుకుంటే వేగంగా 100 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చని, 6,000 స్థాయిని వదులుకుంటే నిలువునా పతనంకావొచ్చన్నది ఈ ఆప్షన్ బిల్డప్ అంతరార్థం. నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి మాత్రం లాంగ్ అన్‌వైండింగ్ కొనసాగింది. ఈ కాంట్రాక్టు ఓఐలో మరో 1.23 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 1.51 కోట్ల షేర్లకు తగ్గింది. నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్లో తాజాగా 16 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 73 లక్షల షేర్లకు పెరిగింది.