మార్కెట్ అక్కడక్కడే...
స్వల్ప లాభాల్లో స్టాక్ సూచీలు
♦ వరుసగా ఐదో రోజూ పైపైకే
ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన గురువారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు స్వల్ప లాభ్లాలో ముగిసింది. విదేశీ కొనుగోళ్ల జోరుతో వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 25,844 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 0.05 పాయింట్ల లాభంతో 7,915 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఆర్థిక రంగ, లోహ షేర్లు లాభపడ్డాయి.
ఐదు రోజుల్లో 1,171 పాయింట్ల లాభం
లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ బ్లూ చిప్ షేర్ల జోరుతో మరింతగా లాభపడింది. అయితే లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండడం, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 25,956, 25,717 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. మొత్తం మీద సెన్సెక్స్ 239 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. అంచనాల కంటే తక్కువగానే టీసీఎస్ మార్జిన్లు ఉండడం, అధిక సరఫరా అంశాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనం కావడంతో లాభాలు తగ్గాయని నిపుణులంటున్నారు. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1171 పాయింట్లు లాభపడింది. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం, వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న అంచనాలు, ఇన్ఫోసిస్ గెడైన్స్ అంచనాలను మించడం... దీనికి ప్రధాన కారణాలు.
బుల్ రన్ మొదలైంది..: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా
మన స్టాక్ మార్కెట్ దీర్ఘకాలిక బుల్ రన్ ప్రారంభ దశలో ఉందని ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చని, సమంజసమైన రాబడులు పొందవచ్చని చెప్పారు. అయితే మరీ అత్యావ రాబడులు ఆశించవద్దని ఇన్వెస్టర్లకు హితవు పలికారు. రియల్టీ, ఫార్మా, ఐటీ రంగాలు బుల్లిష్‌గా ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు.