సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం ఆరంభం నుంచి నష్టాల్లో కొనసాగాయి. తద్వారా గత రెండు సెషన్ల లాభాలకు చెక్ చెప్పింది. ఇంట్రాడేలో కోలుకున్నా చివరి గంటలో అమ్మకాలు పుంజుకోవడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 536 పాయింట్లు కోల్పోయి 31327 వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి 9154వద్ద ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్ మినహా మిగిలిన అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోగా, అమ్మకాల ఒత్తిడితో ఐటీ, టెక్నాలజీ షేర్లు కూడా నష్టపోయాయి. కోవిడ్-19 దెబ్బకు ఏర్పడిన లిక్విడిటీ కొరత, ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్‌కు పెరుగుతున్న ఒత్తిళ్లతో ఆరు డెట్ పథకాలను మూసివేస్తున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రకటనతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, ఏఎంసీ, లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వేదాంత, ఎల్ అండ్ టీ, హీరో మోటోకార్ప్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. జీ ఎంటర్టెయిన్మెంట్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
అటు డాలరు మారకంలో రూపాయి 76.30 వద్ద కనిష్టంగా ప్రారంభమై, సెషన్‌లో 76.47 కి పడిపోయింది. అనంతరం 40 పైసలు క్షీణించి 76.46 వద్ద స్థిరపడింది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.06 వద్ద ముగిసింది. కరోనావైరస్ కోసం యాంటీవైరల్ డ్రగ్ వైఫల్యం వార్తల తరువాత మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని ఫారెక్స్ వ్యాపారులు చెప్పారు. డాలర్ ఇండెక్స్ 0.31 శాతం పెరిగి 100.74 కు చేరుకుంది. (5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment