లాభాల్లోంచి.. నష్టాల్లోకి
► 57 పాయింట్ల నష్టంతో 29,365కు సెన్సెక్స్
► 17 పాయింట్ల నష్టంతో 9,119కు నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 57 పాయింట్లు నష్టపోయి 29,365 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 9,119 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, కొన్ని వాహన, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు లాభపడ్డాయి. ఇక వారం పరంగా చూస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ 96 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
ఫలితాలు మిశ్రమంగా ఉండటం వల్లే...: ఇప్పటివరకూ వెలువడిన కంపెనీల ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండడం, ఫ్రాన్స్ ఎన్నికలపై ఆందోళనలు.. ప్రతికూల ప్రభావం చూపాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
రక్షణాత్మక, రిస్క్ ప్రీమియమ్‌లు పెరిగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో భారత రుణభారం మరింత పెరిగే అవకాశాలున్నాయని ఐఎంఎఫ్ హెచ్చరించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మధ్యాహ్నం వరకూ లాభాల్లో ఉన్న సెన్సెక్స్ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒక దశలో 162 పాయింట్లు లాభపడి, మరొక దశలో 163 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఒక దశలో 47 పాయింట్లు లాభపడి, మరొక దశలో 48 పాయింట్లు నష్టపోయింది.