* వారం రోజుల గరిష్టానికి సెన్సెక్స్
* 8,300 పైన నిఫ్టీ
మార్కెట్ అప్‌డేట్
పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై ఆశావహ అంచనాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ లాభపడ్డాయి. సోమవారం దాదాపు రోజంతా నష్టాల్లోనే ట్రేడయినా చివరి గంటన్నర వ్యవధిలో లాభాలు నమోదు చేశాయి. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి వారం రోజుల గరిష్ట స్థాయిలో ముగిసింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన 8,300 మార్కును దాటి .. 38 పాయింట్ల లాభంతో 8,323 వద్ద ముగిసింది.
సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతుతో క్రితం ముగింపు కన్నా అధికంగా 27,524 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత లాభాల స్వీకరణతో 27,324 స్థాయికి పడిపోయింది. అయితే, మధ్యాహ్నం సెషన్లో మళ్లీ కోలుకుని చివరికి 27,585 వద్ద ముగిసింది. జనవరి 5 నాటి 27,842 క్లోజింగ్ తర్వాత ఇదే అత్యధికం. దీంతో సెన్సెక్స్ వరుసగా మూడు రోజుల్లో 676 పాయింట్లు పెరిగినట్లయింది. మొత్తం మీద బీఎస్‌ఈలో 1,651 స్టాక్స్ లాభాల్లోనూ, 1,253 స్టాక్స్ నష్టాల్లోనూ ముగిశాయి.
టర్నోవరు రూ. 3,285 కోట్ల నుంచి రూ. 3,019 కోట్లకు తగ్గింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ స్టాక్స్ విభాగంలో రూ. 14,485 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 1,73,407 కోట్లు టర్నోవరు నమోదైంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఆసియా దేశాల్లో చాలా మటుకు సూచీలు నష్టపోయాయి. ఉద్దీపన ప్యాకేజీలు యూరో దేశాల సమస్యలు తీర్చలేకపోవచ్చన్న ఆందోళనలు ఇందుకు కారణం. జపాన్ మార్కెట్‌లో ట్రేడింగ్ జరగలేదు. మరోవైపు, యూరప్ సూచీల్లో లాభాల్లో ముగిశాయి.
చివర్లో లాభాలు
Published Tue, Jan 13 2015 1:42 AM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM
Advertisement
Advertisement