
సెన్సెక్స్ @ 27000
♦ లాభాల స్వీకరణతో
♦ 26,843 పాయింట్ల వద్ద ముగింపు
♦ 8,260 పాయింట్ల నుంచి తగ్గిన నిఫ్టీ
ముంబై: సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావంతో శుక్రవారం భారత్ స్టాక్ సూచీలు జోరుగా ప్రారంభమైనా, లాభాల స్వీకరణతో చివరకు ఫ్లాట్‌గా ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిదశలో 27,000 పాయింట్ల స్థాయిని తాకింది. ఇటీవల పెరిగిన షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ క్రితం రోజుతో పోలిస్తే దాదాపు మార్పేమీ లేకుండా 26,843 పాయింట్ల వద్దే ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల స్వల్పలాభంతో 8,221 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
అమెరికా జాబ్స్ డేటాపై కన్ను..: వచ్చేవారం రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్ష, అమెరికాలో జాబ్స్ డేటా వెల్లడి వంటి అంశాల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారని, దాంతో స్టాక్ సూచీలు గరిష్టస్థాయి వద్ద స్థిరపడలేదని విశ్లేషకులు తెలిపారు.
టెలికాం షేర్లు పతనం..: ఐడియా సెల్యులర్ షేర్లను ప్రైవేటు ఈక్విటీ సంస్థ ఈక్విటీ పార్టనర్స్ తక్కువ ధరకు విక్రయించడంతో ఈ షేరు 11% పడిపోయింది. నిఫ్టీ-50 షేర్లలో భారీగా పతనమైన షేరు ఇదే. ఈ ప్రభావం భారతీ ఎయిర్‌టెల్‌పై పడటంతో ఈ షేరు 2.12% క్షీణించింది.
ఫుడ్స్ అండ్ రిఫ్రెష్‌మెంట్ వ్యాపారాన్ని 2 ప్రత్యేక యూనిట్లగా విభజించనున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించడంతో ఆ షేరు 1.8% పెరుగుదలతో రూ.885 వద్ద ముగిసింది.