
ప్లస్ 210 నుంచి మైనస్ 38కు
లాభాల స్వీకరణతో నష్టాలు
* 38 పాయింట్ల నష్టంతో 26,553కు సెన్సెక్స్
* 20 పాయింట్ల నష్టంతో 8,040కు నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా, బిహార్ ఎన్నికల ఫలితాలపై ఆందోళన, ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా ఫార్మా, ఐటీ, బ్యాంక్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 38 పాయింట్లు నష్టపోయి 26,553 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8,040 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా, టెక్నాలజీ, కొన్ని ఆయిల్ షేర్లు మార్కెట్‌ను పడగొట్టాయి.
లాభాల నుంచి నష్టాల్లోకి..
అమెరికా మార్కెట్లు మంగళవారం పెరగడంతో బుధవారం ఆసియా మార్కెట్లు పెరిగాయి. దీంతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. ఇటీవల బాగా పతనమైన బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో ఒక దశలో సెన్సెక్స్ 210 పాయింట్లు లాభపడింది.
సెప్టెంబర్‌లో 50.5గా ఉన్న చైనా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అక్టోబర్‌లో 52కు పెరగడం, గత నెలలో భారత సేవల రంగం కార్యకలాపాలు 8 నెలల గరిష్టానికి చేరాయని నికాయ్ వెల్లడించడం సానుకూల ప్రభావం చూపాయి. అయితే బిహార్ ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్ల ఆందోళన, అలాగే లాభాల స్వీకరణ ప్రతికూలత చూపాయి.