ముంబై: మోదీ సారథ్యంలోని ప్రస్తుత ఎన్‌డీయే సర్కారే తాజాగా ముగిసిన ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు మార్కెట్లను గంగ వెర్రులెత్తించాయి. ఆదివారంతో చివరి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియగా, ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎన్డీయేకు 300 స్థానాలు ఖాయమని దాదాపు అన్ని సర్వే సంస్థలూ ప్రకటించడం సోమవారం మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో అసలైన ఫలితాలు రావడానికి (ఈ నెల 23) ముందే సూచీలు భారీ ర్యాలీ జరిపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1,422 పాయింట్లు లాభపడి 39,352 పాయింట్లకు చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 421 పాయింట్లు ర్యాలీ చేసి 11,828 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. 2013 సెప్టెంబర్ 10 తర్వాత ఒక్క రోజులో సూచీలు ఈ స్థాయిలో లాభపడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిఫ్టీకి ఇది ఆల్‌టైమ్ గరిష్ట ముగింపు కూడా. అంతేకాదు నిఫ్టీ ఈ స్థాయిలో పెరగడం 2009 తర్వాతే మళ్లీ ఇదే. మోదీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ సర్కారు తొలి ఐదేళ్ల కాలంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడం, మరో విడత ప్రస్తుత సర్కారుకే అవకాశం ఇవ్వడం వల్ల సంస్కరణల పథం కొనసాగుతుందన్న భరోసా ఉంటుందన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ స్టాక్స్ ముందుండగా, అన్ని రంగాల స్టాక్స్ ర్యాలీలో పాల్గొన్నాయి. బ్యాంక్ నిఫ్టీ రికార్డు గరిష్టానికి ఎగబాకింది. ఈ సానుకూల సెంటిమెంట్ రూపాయిపైనా ప్రసరించింది. డాలర్‌తో 49 పైసలు లాభపడి 69.74 వద్ద క్లోజయింది.
ఆల్‌టైమ్ హైకి 66 స్టాక్స్
బీఎస్‌ఈలో 66 స్టాక్స్ నూతన 52 వారాల గరిష్ట స్థాయిలను నమోదు చేయగా, అదే సమయంలో 151 స్టాక్స్ ఏడాది కనిష్ట స్థాయిలకు చేరాయి. బజాజ్ ఫైనాన్స్, డీసీబీ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌ఆర్‌ఎఫ్, టైటాన్, కోటక్ బ్యాంకు, పీవీఆర్ ఏడాది గరిష్ట స్థాయిలకు చేరిన వాటిల్లో ఉన్నాయి. బయోకాన్, బినానీ ఇండస్ట్రీస్, జుబిలంట్, మోన్‌శాంటో తదితర స్టాక్స్ ఏడాది కనిష్ట స్థాయిలకు చేరాయి. బీఎస్‌ఈలో 1,998 స్టాక్స్ లాభపడగా, 631 నష్టపోయాయి. రోజంతా ఐటీ సూచీ నష్టాల్లోనే కొనసాగి చివరికి స్వల్ప లాభంలో ముగిసింది. బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ మినహా సెన్సెక్స్ స్టాక్స్ అన్నీ లాభపడినవే. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ప్రధాన సూచీలకు అనుగుణంగా 3.5 శాతం వరకు ర్యాలీ చేశాయి. ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో మార్కెట్లు అసాధారణ ర్యాలీ జరిపాయని ఎమ్‌కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ అన్నారు.
►బీఎస్‌ఈ సెన్సెక్స్ 3.75 శాతం, నిఫ్టీ 3.69 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 4 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 4.61 శాతం చొప్పున లాభపడ్డాయి.
► 1,309 పాయింట్ల పెరుగుదలతో (4.45%) నిఫ్టీ బ్యాంక్ సూచీ రికార్డు స్థాయి ఒక్క రోజు గరిష్ట లాభాన్ని నమోదు చేసింది.
► ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులో రూ. 5.33 లక్షల కోట్ల మేర పెరుగుదల.
► పదేళ్ల బాండ్ ఈల్డ్ 7.29 శాతానికి క్షీణత. గత శుక్రవారం క్లోజింగ్ 7.36 శాతం.
►49 పైసల లాభంతో 69.74కు రూపాయి
ఒక్కరోజే పెరిగిన సంపద రూ. 5.33 లక్షల కోట్లు
సెన్సెక్స్ సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, యస్ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి, ఓఎన్‌జీసీ ఎక్కువగా లాభపడ్డాయి. మార్కెట్ల రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.5,33,463 కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,51,86,312 కోట్లకు వృద్ధి చెందింది. గత మూడు రోజుల లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద మొత్తం మీద రూ.7.48 లక్షల కోట్ల మేర పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment