నాలుగో రోజూ ర్యాలీ
సెన్సెక్స్ 190 పాయింట్లు, నిఫ్టీ 64 పాయింట్లు అప్
ముంబై: ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వెల్లడించిన ఫలితాలు ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చడంతో మార్కెట్ వరుసగా నాలుగోరోజూ పెరిగింది. సోమవారం స్టాక్ సూచీలు మూడున్నర నెలల గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 190 పాయింట్ల పెరుగుదలతో 25,816 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 7,900 పాయింట్ల స్థాయిని అధిగమించిన నిఫ్టీ 64 పాయింట్లు ర్యాలీ జరిపి 7,915 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామికోత్పత్తి పెరగడం సహా వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాల కారణంగా కొద్దిరోజుల నుంచి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకులు చెప్పారు.
ఇన్ఫోసిస్ జోరు...
గత వారాంతంలో ఇన్ఫోసిస్ మార్కెట్ అంచనాల్ని మించి ప్రకటించిన క్యూ4 ఫలితాల ప్రభావంతో సోమవారం ఆ షేరు భారీగా పెరిగింది. ట్రేడింగ్ ఫ్రారంభంలో 8 శాతం వరకూ షేరు ఎగిసినప్పటికీ, తదుపరి లాభాల స్వీకరణ కారణంగా గరిష్టస్థాయి నుంచి కొంత తగ్గింది. చివరకు 5.7 శాతం లాభంతో రూ.1,239 వద్ద ముగిసింది.
ఈ షేరుకి ఇది చరిత్రాత్మక గరిష్ట ముగింపు. మరో ఐటీ దిగ్గజం టీసీఎస్‌పై అమెరికా కోర్టు రూ. 6,000 కోట్ల జరిమానా విధించిందన్న వార్తతో ఆ షేరు ట్రేడింగ్ తొలిదశలో 3 శాతం వరకూ క్షీణించింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో టీసీఎస్ షేరు చివరకు నష్టాలను చాలావరకూ పూడ్చుకుని, చివరకు క్రితం ముగింపు స్థాయిలోనే స్థిరపడింది.
నేడు మార్కెట్లకు సెలవు
మహావీర్ జయంతి సందర్భంగా నేడు(మంగళవారం) మార్కెట్లకు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఫారెక్స్, మనీ, బులియన్, ఇతర కమోడిటీ మార్కెట్లు పనిచేయవు.
నాల్కో షేరు రయ్...
రూ. 3,250 కోట్లతో షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రభుత్వ రంగ కంపెనీ నాల్కో ప్రకటించడంతో ఆ షేరు 9.7 శాతం ఎగిసి రూ. 45.20 వద్ద ముగిసింది. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకునేందుకు డెరైక్టర్ల బోర్డు ఏప్రిల్ 22న సమావేశం కానున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ప్రభుత్వం వద్ద నుంచి 25 శాతం వాటాను రూ. 3,250 కోట్లకు బైబ్యాక్ చేయాలన్నది ప్రతిపాదన.