ఆరో రోజూ అప్
సెన్సెక్స్ మరో 134 పాయింట్లు జంప్
42 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ముంైబె : పలు సానుకూలాంశాలతో భారత్ స్టాక్ సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లో కూడా ర్యాలీ జరిపాయి. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 134 పాయింట్లు పెరిగి 8 నెలల గరిష్టస్థాయి 27,279 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్ల పెరుగుదలతో 10 నెలల గరిష్టస్థాయి 8,371 పాయింట్ల వద్ద ముగిసింది. బ్రెగ్జిట్ ఆందోళనల్ని తొలగించేందుకు వివిధ దేశాల కేంద్రబ్యాంకులు తాజా ఉద్దీపనల్ని ప్రకటించవచ్చన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరగడంతో మన మార్కెట్ పటిష్టంగా ప్రారంభమయ్యింది. ట్రేడింగ్ తొలిదశలో సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరగ్గా, నిఫ్టీ 8,400 సమీపస్థాయిని చేరింది. అయితే ముగింపులో కొన్ని ఎంపికచేసిన షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరపడంతో సూచీలు ప్రారంభస్థాయిని నిలుపుకోలేకపోయాయి.
జీఎస్‌టీ ఆమోదంపై అంచనాలు...
దేశమంతటా రుతుపవనాలు చురుగ్గా వ్యాపిస్తున్నాయన్న వార్తలు, జీఎస్‌టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందవచ్చన్న అంచనాలతో మార్కెట్లో తాజా కొనుగోళ్లు జరిగినట్లు విశ్లేషకులు చెప్పారు. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పెరగడం కూడా సెంటిమెంట్‌ను బలపర్చింది. రూపాయి విలువ 67.27 స్థాయికి చేరింది. కాగా వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా రియల్టీ ఇండెక్స్ 2.2 శాతం ఎగిసింది.
ఈ ఏడాది చివరకు సెన్సెక్స్ 28,500 పాయింట్లకు..!
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, హెచ్‌ఎస్‌బీసీ, భారత్ రేటింగ్‌ను తటస్థం నుంచి ఓవర్‌వెయిట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయని, కంపెనీల ఆదాయ ఆర్జన అంచనాలు మరింత వాస్తవికంగా ఉండబోతున్నాయని పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి సెన్సెక్స్ 28,500కు చేరుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.