Indian stock indices
-
సాక్షి మనీ మంత్ర: ఆరంభం నుంచి నష్టాల్లో ట్రేడయిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభం నుంచి మార్కెట్ ముగిసే వరకు నష్టాల్లోనే పయనించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65629 వద్ద.. నిఫ్టీ 46.4 పాయింట్లను కోల్పోయి 19624 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 34.55 పాయింట్లు నష్టపోయాయి. హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఆలోచిస్తున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ భయాలు మార్కెట్లను నష్టాల్లో పయనించేలా చేశాయి. ఈ తరుణంలో మార్కెట్లలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు వల్ల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే ఊహాగానాలు ఆందోళనలకు కారణమౌతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే 3.4శాతం, ఆల్ట్రా టెక్ సిమెంట్ 2.8శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.9శాతం, ఎల్ అండ్ టీ 0.2శాతం లాభాల్లో ముగిశాయి. విప్రో 3 శాతం, సన్‌ఫార్మా 1.5శాతం, టెక్ మహీంద్రా 1.4శాతం, ఎన్టీపీసీ 1.3శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.1శాతం, భారతీఎయిర్‌టెల్ 1 శాతంమేర నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఆరో రోజూ అప్
సెన్సెక్స్ మరో 134 పాయింట్లు జంప్ 42 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంైబె : పలు సానుకూలాంశాలతో భారత్ స్టాక్ సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లో కూడా ర్యాలీ జరిపాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 134 పాయింట్లు పెరిగి 8 నెలల గరిష్టస్థాయి 27,279 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్ల పెరుగుదలతో 10 నెలల గరిష్టస్థాయి 8,371 పాయింట్ల వద్ద ముగిసింది. బ్రెగ్జిట్ ఆందోళనల్ని తొలగించేందుకు వివిధ దేశాల కేంద్రబ్యాంకులు తాజా ఉద్దీపనల్ని ప్రకటించవచ్చన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరగడంతో మన మార్కెట్ పటిష్టంగా ప్రారంభమయ్యింది. ట్రేడింగ్ తొలిదశలో సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరగ్గా, నిఫ్టీ 8,400 సమీపస్థాయిని చేరింది. అయితే ముగింపులో కొన్ని ఎంపికచేసిన షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరపడంతో సూచీలు ప్రారంభస్థాయిని నిలుపుకోలేకపోయాయి. జీఎస్టీ ఆమోదంపై అంచనాలు... దేశమంతటా రుతుపవనాలు చురుగ్గా వ్యాపిస్తున్నాయన్న వార్తలు, జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందవచ్చన్న అంచనాలతో మార్కెట్లో తాజా కొనుగోళ్లు జరిగినట్లు విశ్లేషకులు చెప్పారు. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పెరగడం కూడా సెంటిమెంట్‌ను బలపర్చింది. రూపాయి విలువ 67.27 స్థాయికి చేరింది. కాగా వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా రియల్టీ ఇండెక్స్ 2.2 శాతం ఎగిసింది. ఈ ఏడాది చివరకు సెన్సెక్స్ 28,500 పాయింట్లకు..! అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, హెచ్ఎస్బీసీ, భారత్ రేటింగ్‌ను తటస్థం నుంచి ఓవర్‌వెయిట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయని, కంపెనీల ఆదాయ ఆర్జన అంచనాలు మరింత వాస్తవికంగా ఉండబోతున్నాయని పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి సెన్సెక్స్ 28,500కు చేరుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ
సానుకూల మధ్యంతర బడ్జెట్ ప్రభావంతో పాటు ప్రపంచ మార్కెట్లు పెరగడంతో భారత్ స్టాక్ సూచీలు మంగళవారం మూడు వారాల గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్లు ర్యాలీ జరిపి 20,634 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఈ స్థాయిలో క్లోజ్‌కావడం జనవరి 29 తర్వాత ఇదే ప్రధమం. వరుసగా మూడు రోజుల్లో 440 పాయింట్లు ఎగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ మరో 54 పాయింట్లు పెరిగి 6,127 పాయింట్ల వద్ద క్లోజ్అయ్యింది. కనిష్టస్థాయిల్లో ట్రేడవుతున్న బ్యాంకింగ్ షేర్లలో తాజా కొనుగోళ్లు జరిగాయి. ద్రవ్యలోటును 4.6 శాతానికి ప్రభుత్వం నియంత్రిస్తుందన్న ఆర్థిక మంత్రి ప్రకటనతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మెరుగుపడిందని, దాంతో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గెయిల్,ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్‌లు స్వల్పంగా తగ్గాయి. ఎక్సయిజు సుంకాల తగ్గింపుతో క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ షేర్లలో వరుసగా రెండోరోజు ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లు ఆ వర్గాలు వివరించాయి. నిఫ్టీలో షార్ట్ కవరింగ్.... కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్న 6,100 స్థాయిని దాటడంతో నిఫ్టీ ఫ్యూచర్లో షార్ట్ కవరింగ్ జరిగింది. ఫలితంగా ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 5.70 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.57 కోట్ల షేర్లకు దిగింది. 6,100 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్లో బిల్డప్ 47 లక్షల షేర్లకు తగ్గగా, పుట్ ఆప్షన్లో బిల్డప్ 51 లక్షల షేర్లకు పెరిగింది. గత రెండు వారాల్లో పలు దఫాలు మద్దతును అందించిన 6,000 స్ట్రయిక్ వద్ద మరింత పుట్ రైటింగ్ జరగడంతో ఈ ఆప్షన్లో ఓఐ 1.09 కోట్ల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో 6,100పైన నిఫ్టీ స్థిరపడితే క్రమేమీ పెరగవచ్చని, ఆ స్థాయిని కోల్పోతే 6,000 స్థాయి గట్టి మద్దతు ఇవ్వవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది.