బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ
సానుకూల మధ్యంతర బడ్జెట్ ప్రభావంతో పాటు ప్రపంచ మార్కెట్లు పెరగడంతో భారత్ స్టాక్ సూచీలు మంగళవారం మూడు వారాల గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 170 పాయింట్లు ర్యాలీ జరిపి 20,634 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఈ స్థాయిలో క్లోజ్‌కావడం జనవరి 29 తర్వాత ఇదే ప్రధమం. వరుసగా మూడు రోజుల్లో 440 పాయింట్లు ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరో 54 పాయింట్లు పెరిగి 6,127 పాయింట్ల వద్ద క్లోజ్‌అయ్యింది.
కనిష్టస్థాయిల్లో ట్రేడవుతున్న బ్యాంకింగ్ షేర్లలో తాజా కొనుగోళ్లు జరిగాయి. ద్రవ్యలోటును 4.6 శాతానికి ప్రభుత్వం నియంత్రిస్తుందన్న ఆర్థిక మంత్రి ప్రకటనతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మెరుగుపడిందని, దాంతో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గెయిల్,ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్‌లు స్వల్పంగా తగ్గాయి. ఎక్సయిజు సుంకాల తగ్గింపుతో క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ షేర్లలో వరుసగా రెండోరోజు ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లు ఆ వర్గాలు వివరించాయి.
నిఫ్టీలో షార్ట్ కవరింగ్....
కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్న 6,100 స్థాయిని దాటడంతో నిఫ్టీ ఫ్యూచర్‌లో షార్ట్ కవరింగ్ జరిగింది. ఫలితంగా ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 5.70 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.57 కోట్ల షేర్లకు దిగింది. 6,100 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్లో బిల్డప్ 47 లక్షల షేర్లకు తగ్గగా, పుట్ ఆప్షన్లో బిల్డప్ 51 లక్షల షేర్లకు పెరిగింది. గత రెండు వారాల్లో పలు దఫాలు మద్దతును అందించిన 6,000 స్ట్రయిక్ వద్ద మరింత పుట్ రైటింగ్ జరగడంతో ఈ ఆప్షన్లో ఓఐ 1.09 కోట్ల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో 6,100పైన నిఫ్టీ స్థిరపడితే క్రమేమీ పెరగవచ్చని, ఆ స్థాయిని కోల్పోతే 6,000 స్థాయి గట్టి మద్దతు ఇవ్వవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది.