సెన్సెక్స్ రికార్డు ముగింపు
చూస్తుండగానే మార్కెట్లు రివ్వుమన్నాయి. అంతా గమనించేలోగానే సెన్సెక్స్ కొత్త రికార్డులకు చేరిపోయింది. పలు సానుకూలాంశాల ప్రభావంతో బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ బుధవారం మరో 105 పాయింట్లు ర్యాలీ జరిపి 21,034 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఈ స్థాయిలో ముగియడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ స్థాయికి చేరటం కూడా ఐదున్నరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆర్‌బీఐ క్రెడిట్ పాలసీ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో మంగళవారం పెద్ద ర్యాలీ జరిపి ఊపుమీదున్న సెన్సెక్స్‌కు అంతర్జాతీయ అనుకూలాంశాలు తోడవ్వడంతో బుధవారం అవలీలగా రికార్డు స్థాయిలో ముగిసింది.
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణలో జాప్యం జరుగుతుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు ర్యాలీ జరపడం, అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనుండటంతో స్థానిక మార్కెట్లో జరిగిన షార్ట్ కవరింగ్, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు కొనసాగడం... ఇవన్నీ సెన్సెక్స్ అప్‌ట్రెండ్‌కు ఊతమిచ్చాయి. 2008 జనవరి 10న సెన్సెక్స్ ఇంట్రాడేలో 21,207 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని చేరింది. కానీ చివర్లో పతనమై 20,582 పాయింట్ల వద్ద ముగిసింది. నాటి స్థాయికి అధిగమించాలంటే మరో 173 పాయింట్లు చాలు. ఆ రికార్డు కూడా మరెంతో దూరం లేదన్నది ట్రేడింగ్ వర్గాల మాట.
6,252 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ....
సెన్సెక్స్ బాటలోనే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 31 పాయింట్లు పెరిగి 6,252 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే నిఫ్టీ 2008 జనవరి 8న ఇంట్రాడేలో సాధించిన 6,357 పాయింట్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాలంటే ఇంకా 105 పాయింట్లు పెరగాల్సివుంటుంది. శాతాల్లో చూస్తే చరిత్రాత్మక గరిష్టస్థాయిని అందుకోవాలంటే సెన్సెక్స్ 0.82 శాతం, నిఫ్టీ 1.67 శాతం ర్యాలీ జరపాల్సివుంటుంది. నిఫ్టీ 2010 నవంబర్ 5న 6,338 పాయింట్ల వరకూ పెరిగి 6,312 పాయింట్ల వద్ద ముగిసింది. ఇప్పటివరకూ నిఫ్టీకి ఇదే రికార్డు ముగింపు. చిత్రమేంటంటే సూచీలు ఇలా గరిష్ట స్థాయిల్లో ముగిసినా... పలు మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం ఇంకా చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. నిజానికి మన దేశంలోనే కాదు... ఆసియా, అమెరికా మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ నెలకొంది.
టెలికాం, ఫార్మా, ఐటీ ఊతం...
కొన్నాళ్లుగా కొద్దిరోజుల నుంచి స్తబ్దుగా ఉన్న టెలికాం, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు బుధవారం ర్యాలీ జరిపాయి. డాక్టర్ రెడ్డీస్ 4% ఎగిసి కొత్త రికార్డుస్థాయి రూ. 2,523 వద్ద ముగిసింది. ర్యాన్‌బాక్సీ ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపర్చినా, తాజా కొనుగోళ్ల మద్దతుతో ఆ షేరు 3% పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఐటీసీ, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 1.5% చొప్పున పెరగ్గా, ఐటీ షేర్లు టీసీఎస్, టెక్‌మహీంద్రాలు 2-3% మధ్య ఎగిసాయి.
నికరలాభం తగ్గినా, నిర్వహణ లాభం మెరుగ్గా వుండటంతో టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్... భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం ఎగసింది. టాటా కమ్యూనికేషన్ 10% ర్యాలీ జరిపింది. బ్యాంకింగ్ షేర్లలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2-3% మధ్య పెరిగాయి. కొన్ని మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకుల మొండి బకాయిలు బాగా పెరిగాయన్న వార్తలతో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఐడీబీఐ, ఎస్‌బీఐ షేర్లు క్షీణించాయి. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,017 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ సంస్థలు రూ. 550 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించాయి.