కోలుకున్న స్టాక్ మార్కెట్..
లాభాలు-నష్టాలు-లాభాలు
సెన్సెక్స్ 291 పాయింట్లు అప్ నిఫ్టీకి 72 పాయింట్లు లాభం
సోమవారం భారీ పతనం తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. జీఎస్‌టీ, ఇతర కీలక బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 26,032 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 72 పాయింట్లు లాభంతో 7,881 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,190 పాయింట్లు క్షీణించింది.
షార్ట్ కవరింగ్ చోటు చేసుకోవడం, రూపాయి బలపడడం(55 పైసలు పెరిగి 66.10 వద్ద ముగిసింది), యూరోపియన్ మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్ పుంజుకోవడం వంటి అంశాలూ ప్రభావం చూపాయి. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. రియల్టీ, బ్యాంక్, లోహ, చమురు, గ్యాస్, పీఎస్‌యూ, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు లాభపడ్డాయి.
తీవ్రంగా ఒడిదుడుకులు: సెన్సెక్స్ లాభాల్లో మొదలై, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయి, మళ్లీ లాభాల బాట పట్టింది. సోమవారం ముగింపుతో పోల్చితే ఇంట్రాడేలో 383 పాయింట్లు లాభపడింది. ఒక దశలో 444 పాయింట్లు నష్టపోయింది. చైనా షాంఘై స్టాక్ సూచీ 7.6 శాతం పతనమవడం ప్రభావం చూపింది. ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో మొత్తం 827 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి.
టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,805 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.27,646 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,93,405 కోట్లుగా నమోదైంది. కాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరోప్ మార్కెట్లు 3 నుంచి 5 శాతం శ్రేణిలో లాభపడ్డాయి.
స్టాక్ మార్కెట్ అక్కడక్కడే!: బీఓఎఫ్‌ఏ
భారత స్టాక్ మార్కెట్ సమీప భవిష్యత్తులో అక్కడక్కడే కదలాడుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ) మంగళవారం తెలిపింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు, కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండడం దీనికి కారణాలని తాజా నివేదికలో పేర్కొంది.
రూ.1.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
మంగళవారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.1.5 లక్షల కోట్లు పెరిగింది. సోమవారం సెన్సెక్స్ 1,625 పాయింట్ల పతనంతో రూ. 7 లక్షల కోట్ల సంపద ఆవిరైన విషయం తెలిసిందే. మంగళవారం ట్రేడింగ్ ముగిసిన తరవాత బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.96,51,311 కోట్లకు చేరింది. ఈ మార్కెట్ క్యాప్ సోమవారం 95.29 లక్షల కోట్లకు తగ్గింది.
ఆల్‌టైమ్ హైకి అమరరాజా బ్యాటరీస్
అమర రాజా బ్యాటరీస్ బీఎస్‌ఈలో 15% లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,132ను తాకింది. కేవలం ఒక్క నెలలోనే ఈ షేర్ 34 శాతం పెరిగింది. ఈ ఏడాది జూలై 27న రూ.844గా ఉన్న ఈ షేర్ మంగళవారం 9.5 శాతం లాభంతో రూ.1,078 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం, బ్యాటరీల తయారీలో ఉపయోగించే సీసం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో షేర్ ధర జోరుగా పెరుగుతోందని నిపుణులంటున్నారు.